"గురువాయర్ దేవాలయం పేల్చేస్తాం"
గురువాయర్: ప్రసిద్ది చెందిన దేవాలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు ఫోన్ వచ్చిన సంఘటన కేరళలో జరిగింది. కేరళలోని గురువాయర్ లో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీకృష్ణ దేవాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం గుర్తు తెలియన వ్యక్తి శ్రీకృష్ణ దేవాలయం సిబ్బంది కార్యాలయానికి ఫోన్ చేశాడు. 24 గంటలలో దేవాలయాన్ని పేల్చేస్తామని బెదిరించి ఫోన్ కట్ చేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. దేవాలయం పరిసర ప్రాంతాలను బాంబు స్కాడ్, పోలీసు జాగిలాలతో పరిశీలించారు. దేవాలయానికి వస్తున్న భక్తులను గమనించారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

ముందు జాగ్రత చర్యగా దేవాలయం దగ్గర, పరిసర ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు దేవాలయానికి సరాసరి 25 వేల మంది భక్తులు వస్తుంటారు. ప్రపంచ స్థాయిలో గురువాయర్ శ్రీకృష్ణ దేవాలయానికి మంచి గుర్తింపు ఉంది.
ఖతార్ నుండి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. 2001వ సంవత్సరంలో ఆల్ ఖైదా పేరుతో ఇదే దేవాలయానికి బెదిరింపు లేఖ వచ్చింది. ఇంగ్లీష్ లో వ్రాసిన ఆలేఖలో ఇదే విధంగా బెదిరింపులు చేశారు. గురువాయర్ లో హై అలర్ట్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications