రోడ్డు ప్రమాదంలో మృతి: లేడీ టెక్కీ శరీరం దానం
బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ) మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేశారు. బెంగళూరు నగరంలోని ఆర్ టీ నగర్ సమీపంలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మధురా (24) అనే యువతి మరణించింది.
ఈ ప్రమాదంలో ఈమెతో పాటు ప్రయాణిస్తున్న శోభా రావ్ కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బెళ్తంగడికి చెందిన అశోక్, శాంత దంపతుల కుమార్తె మధురా.
మధురా బీటెక్ పూర్తి చేసింది. అశోక్ బాగల్ కోట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. మధురా తన తల్లి శాంత, సోదరుడితో కలిసి బెంగళూరు చేరుకుని ఆర్ టీ నగర్ లో నివాసం ఉంటున్నది.

గత ఆరు నెలల క్రితం విక్టోరియా రోడ్డులోని సాఫ్ట్ వేర్ కంపెనీలో మధురాకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆమె అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. గురువారం మధురా, శోభా రావ్ స్కూటర్ లో ఉద్యోగానికి బయలుదేరారు.
శోభారావ్ స్కూటర్ నడుపుతున్నారు. మధురా వెనుక కుర్చుని ఉంది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకూ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. మార్గం మధ్యలో ఓ జంక్షన్ దగ్గర పాల ట్యాంకర్ వేగంగా వెళ్లి వీరి స్కూటర్ ను డీకొనింది.
వెనుక కుర్చున్న మధురా హెల్మెట్ బెల్ట్ లాక్ చెయ్యకపోవడంతో అది ఎగిరి కింద పడింది. అదే పాల ట్యాంకర్ మధురా మీద దూసుకు వెళ్లింది. తీవ్రగాయాలైన ఇద్దరిని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మధురా మరణించిందని వైద్యులు చెప్పారు.
మధురా కుటుంబ సభ్యులు తమ కుమార్తె మృతదేహాన్ని బౌరింగ్ ఆసుపత్రికి దానం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మధురా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, పోలీసులకు ఈ విషయం చెప్పారు. ట్యాంకర్ డ్రైవర్‌ను అరెస్టు చేశామని, కేసు దర్యాప్తులో ఉందని శివాజీ నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications