రేపే పోలింగ్: భారీ నగదు, నగలు పట్టివేత -వాటి విలువ రూ.428కోట్లన్న ఈసీ -తమిళనాడులో కలకలం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అక్రమ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు ఛేదించారు. ఇంకొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుండగా ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.428కోట్లని అధికారులు వెల్లడించారు. వివరాలివి..
ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్న ఈసీ.. గడిచిన 24 గంటల్లో చెన్నైసహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లో అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై దాడులు నిర్వహించింది. బృందాలుగా విడిపోయిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా, మొత్తం రూ. 428 కోట్ల సొత్తు పట్టుపడింది.

స్వాధీనం చేసుకున్న వాటిలో రూ. 225.5 కోట్లు నగదు కాగా, బంగారంతో సహా విలువైన లోహాభరణాల విలువ రూ.176.11 కోట్లు అని ఎన్నికల అధికారులు చెప్పారు. అక్రమాలు బయటపడిన వ్యవహారాల్లో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై తరువాతి స్థానాల్లో నిలిచాయి. తాజాగా రాణిపేట జిల్లాలో రూ. 91.56 లక్షలు, చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో 1.23 కోట్ల రూపాయలు, సేలం వీరపాండి వద్ద 1.15 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. కాగా,
తమిళనాడులో గత నెలలో, ఆదాయపు పన్ను శాఖ 16 కోట్లకు పైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది. అలాగే ఎన్నికల నిఘాలో భాగంగా రాష్ట్రంలో పలు సంస్థలపై దాడుల తరువాత సుమారు రూ. 80 కోట్ల బ్లాక్ మనీని గుర్తించింది. మొత్తం 234 నియోజకవర్గాలున్న తమిళనాడు అసెంబ్లీకి మంగళవారం(ఏప్రిల్ 6న) పోలింగ్ జరుగనుంది. మే 2న ఫలితాలు వెల్లడవుతాయి.












Click it and Unblock the Notifications