చెన్నై: కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని చేర్చుకోవడానికి (అడ్మీషన్) రూ. ఒక లక్ష లంచం తీసుకున్న కేంద్రీయ విద్యాలయం పాఠశాల ప్రిన్సిపల్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. చెన్నైలోని అశోక్ నగర్ లోని కేంద్రీయ విద్యాలయం పాఠశాల ప్రిన్సిపల్ ఇ. అనంతన్ ను మంగళవారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

దళిత కుటుంబం !
దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి తన కుమారుడిని కేంద్రీయ విద్యాలయం స్కూల్ లో ఒకటవ తరగతిలో చేర్పించడానికి వెళ్లాడు. ఆర్ టీఈ కోటాలో తన కుమారుడికి సీటు ఇవ్వాలని బాలుడి తండ్రి ప్రిన్సిపల్ ఇ. అనంతన్ కు మనవి చేశాడు.

రూ. లక్ష లంచం
ఆర్ టీఈ కోటాలో మీ అబ్బాయికి ఒకటవ తరగతిలో సీటు ఇవ్వాలంటే రూ. ఒక లక్ష లంచం ఇవ్వాలని ప్రిన్సిపల్ అనంతన్ డిమాండ్ చేశారు. రూ. లక్షకు తక్కువ లంచం ఇచ్చినా సీటు మాత్రం ఇవ్వనని, లంచం ఇస్తేనే సీటు ఇస్తానని ప్రిన్సిపల్ అనంతన్ తేల్చి చెప్పాడు.

లంచం ఇవ్వలేని తండ్రి !
దళితుడైన ఆ తండ్రి రూ. లక్ష లంచం ఇవ్వలేక నానా ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి అవినీతి ప్రిన్సిపల్ ఉన్నంతవరకు తనలాంటి పేదలకు న్యాయం జరగదని నిర్ణయించిన అతను సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

సీబీఐ అధికారుల స్కెచ్
సీబీఐ అధికారులు పక్కాప్లాన్ వేశారు. మంగళవారం దళిత తండ్రి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటున్న ప్రిన్సిపల్ అనంతన్ ను ఆయన చాంబర్ లోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అనంతన్ ను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో అనంతన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం
చెన్నైలోని అశోక్ నగర్ లో 3.75 ఎకరాల స్థలంలో కేంద్ర ప్రభుత్వం 1981లో కేంద్రీయ విద్యాలయం స్థాపించింది. ఈ కేంద్రీయ విద్యాలయంలో తమ పిల్లలను చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఒకటవ తరగతి అడ్మీషన్ కు ప్రిన్సిపల్ అనంతన్ రూ. ఒక లక్ష లంచం తీసుకుని సీట్లు అమ్ముకుంటున్నాడని సీబీఐ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!