Bengal post-poll violence case -సీబీఐ జోరు, ఏకంగా 9 కొత్త కేసులు నమోదు -టార్గెట్ దీదీనా?
పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి మూడు నెలలు పూర్తయినా రాజకీయ వివాదాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. శక్తిమంతమైన ద్వయం మోదీ-షా నేతృత్వంలోని బీజేపీని ఢీకొడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మూడోసారి విజయం సాధించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ హింస చెలరేగింది. నాటి ఘటనలపై కోల్ కతా హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ విచారణను వేగవంతం చేసింది..
బెంగాల్ లో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసకు సంబంధించిన కేసులపై పిటిషనర్లు, మమత సర్కారు భిన్నవాదనలు వినిపిస్తున్న క్రమంలో, సదరు ఘటనలపై కేంద్ర సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని, ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా సమాంతర విచారణ చేస్తుందని కోర్టు చెప్పడం తెలిసిందే. ఈక్రమంలో సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎన్నికల అనంతర హింసపై బెంగాల్ పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా, తగిన సమయంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణ నిమిత్తం నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని, బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసేందుకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు పంపినట్లు సీబీఐ అధికారి ఒకరు చెప్పారు.
హింసకు సంబంధించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీజేపీ నేతలు చేస్తోన్న న్యాయపోరాటం సీఎం మమతకు ఇరకాటంగా మారింది. కేసుల దర్యాప్తును సీబీఐకి, కోర్టు ఆధ్వర్యంలోని సిట్ చేపట్టగా, మమతను టార్గెట్ కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా టీఎంసీ సర్కారు యోచన చేస్తున్నది.












Click it and Unblock the Notifications