CBSEలో కొత్త సబ్జెక్టులు -Microsoft సాయంతో ఈ ఏడాది నుంచే data science బోధన -NEP అనుకూల నిర్ణయం
కొవిడ్ విలయం కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షలన్నీ రద్దయిపోగా, తదుపరి విద్యా సంవత్సరంలో బోధనకు సంబంధించి బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ యుగంలో నిలదొక్కుకునేందుకు వీలుగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు సీబీఎస్‌ఈ సమాయత్తమైంది.
2021-2022 విద్యాసంవత్సరంలో 6-8 తరగతుల విద్యార్థులకు కోడింగ్, 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు డేటాసైన్స్ పాఠ్యాంశాలను అదనంగా చేర్చనుంది. దీనికోసం ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సాయం తీసుకోనుంది. ఆయా పాఠ్యాంశాలను విద్యార్థులకు చేరువ చేయడం వల్ల టెక్నాలజీ పరంగా వారి ఆలోచనా విధానం, గణన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకత మెరుగుపడతాయని సీబీఎస్‌ఈ బోర్డు భావిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ కొత్త పాఠ్యాంశాలను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

''ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో అందుకనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోడింగ్, డేటాసైన్స్ పాఠ్యాంశాల వల్ల విద్యార్థులు టెక్నాలజీ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారు స్వావలంబన దిశగా ప్రయాణించేందుకు ఇదే తొలి మెట్టు. సమస్య పరిష్కారానికి, తార్కిక ఆలోచనలను పెంపొందించుకొని విజయం సాధించడానికి ఇవి ఎంతో అవసరం'' అని సీబీఎస్‌ఈ ఛైర్మన్ మనోజ్ ఆహుజా వెల్లడించారు.
ఆయా కొత్త పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలను మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేస్తోంది. ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని తయారు చేస్తున్నారు. నిజ జీవితంలోని ఉదాహరణలు, ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా పుస్తకాలను అభివృద్ధి చేస్తున్నారు. ''కోడింగ్, డేటాసైన్స్ వంటి నైపుణ్యాలే భవిష్యత్ కరెన్సీ. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోకి వీటిని తీసుకెళ్లగలిగితే భారత్‌లో టెక్నాలజీ నిపుణులను తయారు చేయడంలో ఇవి బలమైన పాత్ర పోషిస్తాయి'' అని మైక్రోసాఫ్ట్ ఇండియా కార్య నిర్వాహక అధ్యక్షుడు నవ్‌తేజ్ బాల్ అన్నారు.












Click it and Unblock the Notifications