ఈసీల నియామక చట్టం తీర్పు రీకాల్ ? ఛీఫ్ జస్టిస్ ముందుకు కీలక పిటిషన్ ..!
2023లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంలో ( CEC) కమిషనర్ల నియామక ప్రక్రియలో మార్పులు చేస్తూ పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిని ఎటూ తేల్చకుండా కాలయాపన చేసిన సుప్రీంకోర్టు.. తాజాగా విభజన తీర్పులు ప్రకటించింది. అంటే ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కోర్టుకు చేరింది.
ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో అప్పటివరకూ ప్రధాని, విపక్ష నేతతో పాటు ఉన్న సుప్రీం ఛీఫ్ జస్టిస్ స్ధానంలో ప్రధాని సిఫార్సు చేసే కేంద్రమంత్రి ఉండేలా కేంద్రం ఈ చట్టంలో మార్పులు చేసింది. దీని రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై విచారణ ఆలస్యం చేస్తూ వచ్చిన సుప్రీంకోర్టు.. ఆ లోపు కేంద్రం కోరుకున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్ బీర్ సింగ్ సంధూ నియామకాలకు పరోక్షంగా కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసీల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ విచారించింది. అప్పటికే విచారణ ఆలస్యమైన ఈ పిటిషన్లను తిరిగి రాజ్యాంగ ధర్మాసనానికి వద్దంటూ దత్తా, ఇవ్వాలంటూ శర్మ తీర్పులిచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ భిన్న తీర్పులపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ తుది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఆయన కూడా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో ఆ ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల్ని రీకాల్ చేయాలంటూ సీనియర్ లాయర్ గోపాల్ శంకర్ నారాయణన్ సుప్రీంలో దాఖలు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 23న ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలు చేస్తున్న మధ్యంతర దరఖాస్తుగా దీన్ని ఆయన పేర్కొన్నారు. సీజేఐ సూర్యకాంత్ ఈ విషయాన్ని పరిశీలించడానికి అంగీకరించారు. తాము పరిశీలించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై మరో క్యూరేటివ్ పిటిషన్ కూడా దాఖలైనట్లు తాను చదివానని సీజేఐ వెల్లడించారు. దీనికి లాయర్ శంకరనారాయణన్ అవునని సమాధానమిస్తూ, దానిని మరొక పక్షం దాఖలు చేసిందన్నారు. కానీ క్యూరేటివ్ పిటిషన్‌కు ముందు దీనిపై సమీక్ష జరగాలన్నారు.














Click it and Unblock the Notifications
