One Nation One Election : జమిలి ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన...మేం రెడీ..
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే లా కమిషన్ అధ్యయనం పూర్తి కావడంతో త్వరలో పార్లమెంటు ప్రత్యేక భేటీ నిర్వహించి అందులో జమిలి ఎన్నికల బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఈసీ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇవాళ దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మరింత క్లారిటీ ఇచ్చింది. జమిలి ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ సంసిద్ధత ఎలా ఉందనే దానిపై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
దేశంలోని లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న బీజేపీ 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఆలోచనపై రాజకీయ చర్చ సాగుతున్న నేపథ్యంలో ఈసీ దీనికి సిద్ధంగా ఉందా అనే ప్రశ్నకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమాధానమిచ్చారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ సిద్ధంగా ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై భోపాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

మా పని ఏమిటంటే ఎన్నికలను సమయానికి ముందే నిర్వహించడం, ఆ సమయం రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టంలో నిర్దేశించబడిందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ 5 సంవత్సరాల పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు ఎన్నికలను ప్రకటించవచ్చని, రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. చట్టపరమైన విధానాలు, రాజ్యాంగం, ఆర్‌పి చట్టం ప్రకారం, ఎన్నికలను నిర్వహించడానికి తమకు ఆదేశాలు ఉన్నాయన్నారు. అలాగే తామూ సిద్ధంగా ఉన్నామన్నారు.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఇప్పటికే నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోంది. మధ్యప్రదేశ్‌లో 47 ఎస్‌టి, 35 ఎస్సీ రిజర్వుడు సహా మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 5.52 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.85 కోట్ల మంది పురుషులు, 2.67 కోట్ల మంది మహిళలు, 1,336 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అలాగే అధికార బీజేపీ, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ రెండూ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications