తెలుగు ప్రజల కోసం రంగంలోకి కేంద్రం.. తమిళనాడు సర్కారుకు షాక్!
తమిళనాడులో తరతరాలుగా నివసిస్తున్న తెలుగు ప్రజల భాషా హక్కులు, రక్షణపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చేసిన వినతులపై స్పందించిన కేంద్రం.. తక్షణ చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదులను బదిలీ చేసింది. ఈ మేరకు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
వినతిపత్రం కదిలిందిలా..
తమిళనాడులోని తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భాషాపరమైన వివక్షపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేరుగా ప్రధాని కార్యాలయానికి వినతిపత్రాలు పంపారు. వాటిని పరిశీలించిన పీఎంవో, తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని భాషా అల్పసంఖ్యాక వర్గాల కమిషనర్ కార్యాలయానికి పంపింది. ఈ వినతులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ కార్యాలయం, నవంబర్ 16, 2026న తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

వినతిపత్రంలోని ప్రధాన అంశాలు ఇవే..
1. 25 ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన జీవో 128
తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ 2001 ఏప్రిల్ 23న జారీ చేసిన జీవో నంబర్ 128 ప్రకారం.. పంచాయతీ అధికారిక కార్యకలాపాల్లో మైనారిటీ భాషలను ఉపయోగించాలి. 1966 నాటి ఉత్తర్వుల స్థానంలో వచ్చి ఈ జీవో ప్రకారం..
*ముఖ్యమైన ప్రభుత్వ నోటీసులు, ఓటర్ల జాబితాలు అధికార భాష తమిళంతో పాటు మైనారిటీ భాషల్లోనూ ప్రచురించాలి.
*ప్రజలు ఉపయోగించే దరఖాస్తు ఫారాలను రెండు భాషల్లోనూ ముద్రించాలి.
*ప్రభుత్వ అధికారులతో మైనారిటీ భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకునే వెసులుబాటు కల్పించాలి.
*ముఖ్యమైన నిబంధనలు, బైలాలను భాషా అల్పసంఖ్యాకుల మాతృభాషలోకి అనువదించాలి.
2. ఉత్తర్వు వర్తించే ప్రధాన తెలుగు ప్రాంతాలు
ఈ ఉత్తర్వు ప్రకారం తమిళనాడులోని పలు జిల్లాల పరిధిలో ఉన్న తాలూకాలను తెలుగు భాషా అల్పసంఖ్యాక ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణి, తిరువళ్లూరు, పొన్నేరి, గుమ్మడిపూండి, ఊత్తుకోట, పల్లిపట్టు, వెల్లూరులో గుడియాత్తం, ధర్మపురిలోని హోసూరు, దేంకణీకోట, కృష్ణగిరి, ఈరోడ్ జిల్లాలోని గోబిచెట్టిపాళయం, పెరుందురై, సత్యమంగళం, కోయంబత్తూరు జిల్లాలోని కోయంబత్తూరు, ఉడుమలైపేట, పల్లడం, అవినాశి, పొల్లాచ్చి, మేట్టుపాళయం, దిండిగల్‌లోని కొడైకెనాల్, పళని, మదురైలోని పెరియకుళం, తిరుమంగళం, విరుదునగర్ జిల్లాలోని విరుదునగర్, శాత్తూరు, అరుప్పుకోట్టై తాలూకాలు ఉన్నాయి.
3. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై ప్రశ్న
జీవో జారీ చేసి పాతికేళ్లు గడుస్తున్నా నేటికీ ఈ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలు, నోటీసులు, దరఖాస్తు ఫారాలు తెలుగులో అందుబాటులో ఉండటం లేదని కేతిరెడ్డి తన వినతిలో పేర్కొన్నారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350, 350బీ కల్పించిన భాషా హక్కులను కాలరాయడమేనని, సొంత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇన్నేళ్లుగా ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
4. హోసూరు సరిహద్దు రికార్డులు, మాతృభాషలో విద్యాహక్కు
హోసూరు తాలూకాలో తెలుగు, కన్నడ, తమిళ ప్రజలు తరతరాలుగా సామరస్యంతో జీవిస్తున్నారని గుర్తుచేశారు. భాషా ప్రాతిపదికన సరిహద్దులు నిర్ణయించిన పటాస్కర్ కమిషన్ ప్రక్రియలో నిజానిజాలు తేల్చేందుకు 1931, 1951 జనాభా లెక్కలు, గ్రామాల వారీ పాలనా రికార్డులను సమర్థ సంస్థతో పునఃపరిశీలన చేయించాలని కోరారు. అలాగే కృష్ణగిరి జిల్లాలో తెలుగు విద్యార్థులకు కనీసం తెలుగు ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాలు కూడా లేవని, మార్కులు లేని నామమాత్రపు భాషగా మాతృభాషను మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు మాతృభాషలో చదువుకునే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
5. సోషల్ మీడియాలో బెదిరింపులపై చట్టపరమైన చర్యలు
హోసూరు అంశంపై తాము శాంతియుతంగా అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా కొందరు అసాంఘిక శక్తులు తెలుగు ప్రజలను కించపరిచేలా దూషించారని కేతిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. "రాష్ట్రం విడిచి వెళ్లిపోండి" అని హెచ్చరించడంతో పాటు, చిరునామాలు అడుగుతూ రాళ్లతో కొడతామని, చంపేస్తామని ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజమని, కానీ ఒక భాషా వర్గాన్ని కించపరుస్తూ ప్రాణహాని కలిగించేలా బెదిరించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తమిళనాడు ప్రభుత్వానికి కేతిరెడ్డి ప్రధాన డిమాండ్లు:
*జీవో నంబర్ 128ను తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలి.
*తమిళనాడులోని తెలుగు ప్రజలకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు, భద్రతా ముప్పుపై అంచనా వేయాలి.
*ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించి 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలి.
*సమస్యల పరిష్కారానికి సంబంధిత ఉన్నతాధికారులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలి.
తమిళనాడులో తెలుగు ప్రజలు రైతులుగా, కార్మికులుగా, వ్యాపారులుగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యారని, తాము అడుగుతున్నది రాజ్యాంగబద్ధమైన రక్షణ మాత్రమే తప్ప ప్రత్యేక సౌకర్యాలు కాదని కేతిరెడ్డి స్పష్టం చేశారు. తాము ఎల్లప్పుడూ శాంతియుత, ప్రజాస్వామ్య మార్గాలనే అనుసరిస్తామని, హింసను లేదా ప్రతీకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని ఆయన తేల్చిచెప్పారు.














Click it and Unblock the Notifications
