మోదీకి ట్రంప్ బిగ్ కాంప్లిమెంట్.. ఆ ఒక్క మాటతో ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు!
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా జరుగుతున్న క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం క్వాడ్ నేతలతో కలిసి వేదిక పంచుకున్న సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయిన డొనాల్డ్ ట్రంప్.. ఆయనను అత్యంత దృఢమైన, కఠినమైన వ్యక్తి అంటూ కొనియాడారు. ఈ సందర్భందా చైనాతో విభేదాలు, ఇరాన్ అణు కార్యక్రమం, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ సహా పలు అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు.
చైనా విభేదాలు, ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ స్పందన
చైనాతో నెలకొన్ని విభేదాలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఆ సమస్యలను ఎంతో సమర్థవంతంగా పరిష్కరించామని పేర్కొన్నారు. ఇవి కేవలం రెండు భిన్నమైన అభిప్రాయాలు మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ఇక ఇరాన్ అణుకార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడిని కఠిన వైఖరిని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదని స్పష్టం చేశారు. మరోవైపు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తనతో భేటీ అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిలో భారత్, జపాన్‌లతో కలిసి ముందుకు..
మనీలా పర్యటనలో భాగంగా అరుదైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రేర్ ఎర్త్ మినరల్స్‌ను ఉత్పత్తి చేస్తోందని, రాబోయే 10 నెలల్లో తన అవసరాలన్నింటినీ తానే తీర్చుకునే స్థాయికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రంగంలో భారత్, జపాన్ దేశాల కృషిని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "అమెరికాతో పాటు భారత్, జపాన్ కూడా ఈ ఖనిజాల ఉత్పత్తిలో వేగంగా పనిచేస్తున్నాయి. మనమందరం కలిసి ఈ దిశగా ముందుకు సాగుతున్నాం" అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రక్షణ రంగ సాంకేతికతలో అత్యంత కీలకమైన ఈ ఖనిజాల సరఫరాలో స్వయం సమృద్ధి సాధించేందుకు క్వాడ్ దేశాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.













Click it and Unblock the Notifications
