రాత్రి కర్ఫ్యూ సహా ఆంక్షలు పెట్టండి: రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి నియంత్రణలోనే ఉన్నప్పటికీ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు, హెచ్చరికలు చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అప్రమత్తం చేసింది.
కరోనా నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శకులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొంది.

కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మిగితా 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం నుంచి 10 శాతం వరకు ఉందని తెలిపింది. ఈ క్రమంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కనిపిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలి. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని స్పష్టం చేసింది.
అంతేగాక, కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి, అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని, జన సమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు చేరింది.












Click it and Unblock the Notifications