Indo-Pak War: ఎమర్జెన్సీ పవర్స్ వాడేయండి..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం..! ఇవన్నీ..
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. భారత్ లో చిచ్చు రేపాలని చూసిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేలా భారత సైన్యం ఈ ఆపరేషన్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రశిబిరాలను నేలకూల్చడంతో పాటు తాజాగా లాహార్ లోని ఆయుధ రక్షణ వ్యవస్థలను కూడా కుప్పకూల్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లోని రాష్ట్రాలపై డ్రోన్లు, మోర్టార్లతో కవ్వింపు చర్యలకు దిగుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధ పరిస్ధితుల్లో వాడే అత్యవసర అధికారాలను వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. 1968 నాటి పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ముఖ్యంగా దాడులు లేదా అంతరాయాల ముప్పు ఉన్న సందర్భాలలో ఈ ఆదేశంతో అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, అత్యవసర కొనుగోళ్లు చేయడానికి వీలవుతుంది.

1968 నాటి పౌర రక్షణ నియమాలలోని సెక్షన్ 11ని అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రధాన కార్యదర్శులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కేంద్ర హోంశాఖ ఇవాళ లేఖ రాసింది. ఈ అధికారాల వల్ల ప్రజలను, ఆస్తులను రక్షించడానికి అవసరమైన ఏవైనా అత్యవసర చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితిలో విద్యుత్, నీరు, ఆసుపత్రులు, కమ్యూనికేషన్ వంటి ముఖ్యమైన సేవలు సజావుగా కొనసాగేలా ఏ చర్య అయినా తీసుకోవచ్చు.
అలాగే కేంద్రం నుంచి అనుమతుల కోసం వేచి ఉండకుండా సాధారణ ప్రక్రియను పక్కనబెట్టి పౌర రక్షణకు అవసరమైన పరికరాలు లేదా సేవలను నేరుగా కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తోంది. సైనిక దాడి అయినా, ఉగ్రవాద దాడి అయినా లేదా సాధారణ జీవితానికి అంతరాయం కలిగించే ఏ చర్య అయినా రాష్ట్రాలు వేగంగా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications