ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధులపై కేంద్రం కీలక ప్రకటన-వారి చదువులకు లోక్ సభలో హామీ
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధుల వ్యవహారం ఇవాళ మరోసారి పార్లమెంటులో చర్చకు వచ్చింది. బడ్జెట్ సమావేశాల రెండో దశ ప్రారంభమైన నేపథ్యంలో విపక్షాలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ప్రభుత్వ ప్రకటనకు పట్టుబట్టాయి. దీంతో స్పందించిన కేంద్రం.. తరలింపుతో పాటు అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన విద్యార్ధుల భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసింది.
ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుంచి తిరిగి దేశానికి తీసుకొచ్చిన భారతీయ విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామని ప్రభుత్వం ఇవాళ లోక్‌సభకు హామీ ఇచ్చింది. ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆపరేషన్ గంగా 130 కోట్ల మంది భారతీయుల సామూహిక విజ్ఞతకు నిదర్శనమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న దేశాలలోని విశ్వవిద్యాలయాలతో భారతీయ విద్యార్థులు తమ చదువులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏదైనా విధానం లేదా చర్చలు తీసుకుంటోందా అని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభలో సమాధానమిచ్చారు. తాము వారిని తీసుకువచ్చినప్పుడు, వారు భవిష్యత్తులో వైద్యులుగా మారడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం, ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చిన భారతీయ విద్యార్ధుల్ని షాక్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఆపరేషన్ గంగా విషయంలో ప్రధాని మోడీ తీసుకున్న చర్యలకు విపక్ష కాంగ్రెస్ ఆయన్ను అభినందించాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ఆపరేషన్ గంగా కోసం ప్రధానిని కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుందని తాను భావించినట్లు ప్రధాన్ వెల్లడించారు. కానీ కాంగ్రెస్ వైపు నుంచి దీనిపై ఎలాంటి స్పందనా రాలేదు.












Click it and Unblock the Notifications