ఆ ఓటీటీని నిషేధించిన కేంద్ర ప్రభుత్వం..!!
న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తోన్న ఓవర్ ది టాప్ (ఓటీటీ), యూట్యూబ్ ఛానల్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎలాంటి అవకాశాలను కూడా వాటికి ఇవ్వట్లేదు. సమాజంలో అశాంతియుత వాతావరణం నెలకొనడానికి, మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించే సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేస్తోంది. అప్పటికప్పుడు బ్యాన్ చేసేలా తక్షణ చర్యలను తీసుకుంటోంది.
ఇప్పుడు తాజాగా మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. దీని పేరు వీడ్లీ టీవీ. భారత్‌కు చెందినది కాదు. పాకిస్తాన్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇది. మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలను ప్రసారం చేస్తోన్న కారణంగా దీన్ని నిషేధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది.
సేవక్: ది కన్ఫెషన్స్.. అనే వెబ్ సిరీస్‌ను ఇటీవలే టెలికాస్ట్ చేసింది వీడ్లీ టీవీ. భారత్‌లో చోటు చేసుకున్న వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సిరీస్‌ను చిత్రీకరించినట్లు విడ్లీ టీవీ పేర్కొంది. దేశానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను చూపించినందుకు ఈ ఓటీటీని నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది. హిందువులకు వ్యతిరేకంగా ఈ వెబ్ సిరీస్ చిత్రీకరించినట్లు పేర్కొంది. అనేక అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఇందులో గుర్తించామని స్పష్టం చేసింది.

వెబ్ సిరీస్ ఓపెనింగ్‌లో.. భారతీయ జెండాలోని అశోక్ చక్రాన్ని మంటల్లో తగులబెడుతున్నట్లు చిత్రీకరించారు. భారత్‌కు సంబంధించిన సున్నితమైన చారిత్రక సంఘటనల వక్రీకరించినట్లు కేంద్రం పేర్కొంది. ఆపరేషన్ బ్లూ స్టార్, దాని అనంతర పరిణామాలు, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, గ్రాహం స్టెయిన్స్ అనే క్రైస్తవ మిషనరీ హత్య, మాలెగావ్ పేలుళ్లు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లు, సట్లెజ్-యమునా లింక్ కాలువకు సంబంధించిన అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలను ఈ వెబ్ సిరీస్‌లో చిత్రీకరించినట్లు కేంద్రం పేర్కొంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని విడ్లీ టీవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పాటు రెండు మొబైల్ అప్లికేషన్లు, నాలుగు సోషల్ మీడియా అకౌంట్లు, ఒక స్మార్ట్ టీవీ యాప్‌ను బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. భారత్‌లో ఉన్న వాస్తవ పరిస్థితులు, ఇక్కడి వాతావరణం, శాంతి సామరస్యం, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగించేలా సేవక్: ది కన్ఫెషన్స్ వెబ్ సిరీస్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. దేశ భద్రతకు ప్రమాదకరమని గుర్తించామని తెలిపింది.












Click it and Unblock the Notifications