జమిలి ఎన్నికలపై లోక్ సభలో కేంద్రం ప్రకటన...
దేశంలో పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నోప్రయోజనాలు ఉన్నాయని కేంద్రం ఎప్పటి నుంచో చెబుతోంది.
ఢిల్లీ : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా జరుగుతున్న ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ఇవాళ మరోసారి ప్రకటన చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడానికి అనుకూలంగా ఉన్నట్లు మరోసారి వెల్లడించింది. ఈ దిశగా రాజ్యాంగ సవరణ, అన్ని రాజకీయ పార్టీల్ని ఒప్పించడం వంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపింది.
లోక్ సభలో విపక్ష సభ్యులు జమిలి ఎన్నికలపై అడిగిన ప్రశ్నకు న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు జవాబు ఇచ్చారు. ఇందులో ఆయన ఎన్నికల సంఘంతో సహా అందరు భాగస్వాములతో దీనిపై సంప్రదింపులు జరిపి పార్లమెంటరీ కమిటీ లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందన్నారు. జమిలి ఎన్నికల కోసం ఆచరణీయమైన రోడ్ మ్యాప్ , ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి తదుపరి పరిశీలన కోసం ఈ విషయం న్యాయ కమిషన్ కు పంపామన్నారు.

జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ప్రభుత్వ ఖజానా భారీగా ఆదా అవుతుందని, ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించడంలో పరిపాలనా, శాంతిభద్రతల యంత్రాంగాలకు ఎదురవుతున్న అనేక సమస్యల్ని నివారించే అవకాశం ఉంటుందని కిరణ్ రిజిజు తెలిపారు. ఇది రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు వారి ఎన్నికల ప్రచారంలో వ్యయాన్ని కూడా ఆదా చేస్తుందని ఆయన వెల్లడించారు. దీంతో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు రిజిజు స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications