ఉజ్వల వంటగ్యాస్ లబ్దిదారులకు కేంద్రం భారీ షాక్
కేంద్ర ప్రభుత్వం 'ఉజ్వల' లబ్ధిదారులకు భారీ షాక్ ఇచ్చింది. వారికి అందజేసే రాయితీ గ్యాస్ సిలిండర్ల కోటాను కుదించింది. ఇప్పటివరకు ఇస్తున్న తొమ్మిది సిలిండర్ల పరిమితిని తగ్గించింది. ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబాల సగటు వార్షిక వినియోగానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, వినియోగం సరాసరి ఆ స్థాయిలో ఉండటమే దీనికి ప్రధాన కారణమని చెబుతోంది.
పేద కుటుంబాల్లోని మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు 2016 మేలో 'ప్రధాని మంత్రి ఉజ్వల యోజన' (పీఎంయూవై)ని ప్రారంభించారు. మొదట 12 సిలిండర్లు ఉండగా, గతేడాది తొమ్మిదికి తగ్గించారు. తాజాగా దీన్ని నాలుగుకి కుదించారు. లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ సవరించిన నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది.

వంట గ్యాస్ ను సరసమైన ధరకే అందించడానికి, 2022 మే నెలలో ప్రభుత్వం సిలిండర్‌కు రూ. 200 రాయితీని ప్రవేశపెట్టింది. 2023 అక్టోబర్‌లో దాన్ని రూ. 300కు పెంచింది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ రిటైల్ ధర రూ. 942గా ఉంది. రూ. 300 రాయితీని మినహాయిస్తే, పీఎంయూవై లబ్ధిదారులు సిలిండర్‌కు రూ. 642 చెల్లించాల్సి ఉంటుంది. గత మూడు నెలల్లోనే రెండు విడతలుగా ధరలు గణనీయంగా పెరిగాయి.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా భారత్ లో గ్యాస్ దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. సౌదీ కాంట్రాక్ట్ ధర ఆధారంగానే భారత్ ధరలను నిర్ణయిస్తుంది. ఫిబ్రవరి నుండి హార్ముజ్ జలసంధి సమీపంలో సరఫరా ఆటంకాలతో అంతర్జాతీయ ధరలు 46 శాతం వరకు పెరిగాయి. ఫలితంగా ఒక్కో సిలిండర్ సరఫరా ఖర్చు రూ. 1,600 మార్కును దాటింది. ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 52,000 కోట్లను సబ్సిడీ రూపంలో భారంగా భరించింది.
ధరలు పెరిగినప్పటికీ, చమురు సంస్థలు ప్రతి సిలిండర్‌పై ఇంకా సుమారు రూ. 700 నష్టపోతున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. అసలు సరఫరా ఖర్చు సుమారు రూ. 1,600 ఉన్న చోట, లబ్ధిదారులకు రూ. 1,000 వరకు ప్రయోజనం చేకూరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల ఉన్నప్పటికీ భారత్ లో ఇప్పటికీ చాలా తక్కువ ధరకే వంట గ్యాస్ పొందుతున్నాయని వివరణ ఇస్తోంది.
చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ మీద లీటరుకు రూ. 6, డీజిల్ మీద రూ. 30 వరకు నష్ట భారం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, చమురు కంపెనీలు మొత్తం మీద రూ. 600-700 కోట్ల వరకు నష్టపోతున్నాయని పెట్రోలియం శాఖ వివరించింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ప్రస్తుత ఇంధన ధరల పెంపు అనివార్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications