పీఎఫ్ పై కేంద్రప్రభుత్వ తుది నిర్ణయం
PF Interest rate: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ధారించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏడు కోట్ల మందికి పైగా లబ్ది పొందగలుగుతారు.
పదవీ విరమణ అనంతర వారి ప్రావిడెంట్ ఫండ్ నిధుల్లో ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేయడానికి వీలు కలిగినట్టయింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై కేంద్రం నిర్ధారించిన వడ్డీ రేటు ఇది. పాత వడ్డీ రేటునే కొనసాగించింది.

ఈపీఎఫ్ డిపాజిట్లపై గత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన వడ్డీ రేటుకు సమానంగా 8.25 శాతాన్ని చెల్లించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఈపీఎఫ్ఓ నిర్ణయించిన విషయం తెలిసిందే. 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రతిపాదనలను ఆమోదం కోసం ఈపీఎఫ్ఓ అధికారులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించారు.
ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్ పై 8.25 శాతం వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఫిబ్రవరి 28వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో వడ్డీ రేటును సవరించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల కిందట అంటే.. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీరేటు 8.15 శాతం.
దీన్ని అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2023-24లో సవరించింది కేంద్ర ప్రభుత్వం. 8.15 నుంచి 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు దీన్ని కొనసాగించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్ పై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం కనిష్ట స్థాయికి తగ్గించిన విషయం తెలిసిందే. 8.1 శాతానికి కుదించింది అప్పట్లో.












Click it and Unblock the Notifications