టీ పార్టీ: సోనియా, మన్మోహాన్‌ను ఆహ్వానించిన మోడీ
న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ఆమోదంప జేసుకోడానికి ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలను కలుపుకుపోవాలని భావిస్తున్నారు. ప్రస్తుత సమావేశాల్లో అత్యంత కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్ టీ) బిల్లు సహా ఇతర కీలక బిల్లులను ఎన్డీఏ ఆమోదించుకోవాల్సి ఉంది.
ఇందులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌లను శుక్రవారం ఆయన తేనీటి విందుకు ఆహ్వానించారు. రేస్ కోర్సు రోడ్డులోని తన నివాసానికి సాయంత్రం 7 గంటలకు రావాలని కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం పంపారు.
శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఈ 'ఛాయ్ పే చర్చా' కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలకమైన జీఎస్‌టీ బిల్లు సహా 36 బిల్లులు సభ ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

గురువారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తోపాటు విపక్షాలన్నింటితో మాట్లాడుతూనే ఉన్నామని, ఈ సమావేశాల్లోనే జీఎస్ టీ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకముందన్నారు.
రాజ్యాంగం అమలుపై జరుగుతున్న ప్రత్యేక చర్చలో భాగంగా శుక్రవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడతారని, మరో మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. కాగా, జీఎస్‌టీపై ఎవరితోనైనా చర్చించేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications