విదేశాల్లో ఉండి పాలన సాగిస్తున్నట్లుంది, వెళ్లిపోవాలి: బాబు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించడం విదేశాల్లో ఉండి పాలన సాగిస్తున్నట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోవాలని, ఈ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలకు స్ప ష్టం చేశారు. హైదరాబాద్‌లో కూర్చుని పరిపాలన సాగించడం తనకు ఏ మాత్రం బాగా లేదని,ఇక్కడ ఉండి పాలన సాగిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని, అది సరికాదని, మనం వెళ్లిపోవాలని, అది తప్పదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి పాలన సాగించడానికి మీరంతా నాకు సహకరించాలని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచే పాలన సాగించే విషయమై ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉందని, ఉద్యోగులు కూడా ఇందుకు సహకరించాలని స్పష్టం చేశారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అశోక్‌బాబు, వెంకటేశ్వరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కత్తి నరసింహారెడ్డి తదితరులు మంగళవారం రాత్రి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పీఆర్సీతోపాటు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

జూన్-జూలై నాటికి కొన్ని శాఖలను విజయవాడకు తరలిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ఇందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే, సరైన సౌకర్యాలు కల్పించకుండా శాఖలను తరలిస్తే తాము తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. వారి వాదనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకీభవించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, మౌలిక సదుపాయాలను నెమ్మది నెమ్మదిగా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న రాజధాని ప్రాంతంలో మూడు వేలమంది ఉద్యోగులకు గృహాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుతో సమావేశం తర్వాత ఆ వివరాలను జేఏసీ నేతలు అశోక్‌బాబు, వెంకటేశ్వరరావు తదితరులు మీడియాకు తెలిపారు. శాఖలను తరలించడం ద్వారా తలెత్తే సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చంద్రబాబు హమీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులు చేసిన సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీనిపై గతంలోనే నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ తదితర చెల్లింపులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి, విజయవాడ, విశాఖ నగర పాలక సంస్థల్లో పని చేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును కూడా 60 ఏళ్లకు పెంచడానికి చంద్రబాబు అంగీకరించారని చెప్పారు.












Click it and Unblock the Notifications