ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు మృతి, ఓ జవానుకు గాయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్‌లోని గల్గాం అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సాయుధ మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో మంగళవారం ఉదయం నుంచి సీఆర్పీఎఫ్ జవాన్లు ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ చేపట్టాయి.
కేంద్ర బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు మధ్యాహ్నం వరకూ భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

మావోయిస్టుల కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్, సాధారణ పౌరుడు గాయపడ్డట్లు బీజాపూర్ ఎస్పీ కమల్ లోచన్ కశ్యప్ వెల్లడించారు. ఒక మావోయిస్టు మృతదేహం లభ్యమైందని, మిగితావారివి దొరకలేదని చెప్పారు.
ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు అనుమానాలున్నాయని.. ఇంకా కూంబింగ్ జరుగుతోందని ఆయన తెలిపారు. మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతోనే కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు. మావోయిస్టులు ముందుగా కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications