వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీరాల – పేరాల: 100 ఏళ్ళ కిందటి ఈ ఉద్యమం 11 నెలలకే ఎందుకు కుప్పకూలింది? ఇది ‘బ్రాహ్మణ – అబ్రాహ్మణవాదానికి మధ్య పోరాటం’లో భాగమా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

''చీరాల, పేరాలను (జనం) వేగంగా ఖాళీ చేస్తున్నారు. సామాన్లు నింపిన ఎండ్ల బండ్ల వరుసలు, వ్యాపారులు వారి సరకులతో పాటు ఈ గ్రామాల నుంచి వెల్లువలా వెళ్లిపోతున్నారు. పేదవాళ్లు ఆడవాళ్లు, మగవాళ్లు తమ సామాన్ల మూటలను నెత్తిన మోసుకుంటూ పోతున్నారు. అన్ని వర్గాల ప్రజలూ ఆనందంగా పాలుపంచుకుంటున్నారు...'' - 1921 ఏప్రిల్ 26వ తేదీన ద హిందూ ఆంగ్ల దినపత్రిక రాసిన కథనంలోని కొన్ని వాక్యాలివి.

ఆ ముందు రోజు.. రెండు ఊర్ల జనాభా దాదాపు 16,000 మంది.. పిల్లలు, వృద్ధులు, ఆడా మగా అందరూ.. తరతరాల వారసత్వంగా ఉన్న ఇళ్లూ వాకిళ్లు వదిలేసి, మూటా మూల్లె సర్దుకుని ఊరి బయటకు వలస వెళ్లిపోయిన ఘట్టమది. ఊరవతల తాటాకులతో పూరిళ్లు కట్టుకుని ఒక కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపు ఏడాది పాటు అక్కడే బతికిన వందేళ్ల కిందటి ఉదంతం.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత చీరాల - పేరాల కేంద్రంగా సాగిన ఆ మహత్తర ఉద్యమం.. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టం.

నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో.. చీరాల-పేరాల గ్రామాలను పంచాయతీ యూనియన్ నుంచి విడదీసి మునిసిపాలిటీగా ప్రకటించడం ఈ ఉద్యమానికి మూల కారణం. మునిసిపాలిటీగా మార్చితే దాదాపు పది రెట్లు పెరిగే పన్నులను తాము భరించలేమని జనం అన్నారు. తమ గ్రామాలను పంచాయతీ యూనియన్‌గానే ఉంచాలని అనేక విధాలుగా కోరారు. కానీ ఫలితం లేకపోవటంతో ఊర్లు ఖాళీ చేసి వెళ్లారు.

ఆంధ్రరత్నగా పేరొందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ ఉద్యమానికి సారథ్యం వహించారు. ఉధృతంగా మొదలైన ఉద్యమం.. ఆయనను ప్రభుత్వం అరెస్ట్‌ చేయటంతో ఏడాది నిండకుండానే నీరుగారిపోయింది. కానీ ఈ ఉద్యమం నాటి స్వాతంత్ర్య పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించింది. స్ఫూర్తి దాయకంగా నిలిచింది.

అయితే.. చీరాల - పేరాల ఉద్యమం వెనుక చాలా చరిత్ర ఉంది. ఆ ఉద్యమం వేదికగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పోరాటాలు కూడా ఉన్నాయి. నాటి చరిత్రకారులు కొందరు వివరించినట్లుగా.. అది 'బ్రాహ్మణ సంస్కృతికి - అబ్రాహ్మణవాదానికి మధ్య' జరిగిన పోరాటం. అది 'భారత గ్రామీణ జీవితానికి - పాశ్చాత్య పట్టణ రాజకీయానికి మధ్య' జరిగిన సంఘర్షణ. అంతేకాదు.. 'కాంగ్రెస్ పార్టీకి - జస్టిస్ పార్టీకి మధ్య' జరిగిన రాజకీయ సమరం కూడా.

ఆ విషయాలు కాస్తైనా తెలుసుకోవాలంటే.. చీరాల - పేరాల ఉద్యమ చరిత్రను, దానికి నాయకత్వం వహించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవితాన్ని, ఆనాటి సాంఘిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు చీరాల ఉద్యమం మీద చూపిన ప్రభావాన్ని.. క్లుప్తంగానైనా చూడాల్సిందే.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎవరు?

చీరాల - పేరాల ఉద్యమానికి అన్నీ తానే అయి నడిపించిన నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.

గోపాలకృష్ణయ్య 1889 జూన్ 2వ తేదీన ఆంధ్రదేశంలోని కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు.

ఆయన తొలుత కూచినపూడిలో ఆ తర్వాత గుంటూరులోని టౌన్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ వరకూ చదివారు. అయితే మెట్రిక్యులేషన్ పరీక్షలు మూడుసార్లు తప్పారు. దీంతో ఆయనను బాపట్ల పంపించారు. అక్కడ కష్టపడి చదివిన గోపాలకృష్ణయ్య మద్రాస్ యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ పాసయ్యారు.

అనంతరం బాపట్ల తాలూకా ఆఫీసులో ఏడాది పాటు గుమాస్తాగా పనిచేశారు. 'జీవితం నిస్సారంగా ఉండే ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేయటం కన్నా వీధుల్లో బిచ్చమెత్తుకోవటం మేలు' అంటూ ఆయన తన పినతండ్రికి రాసిన ఒక లేఖలో తన ఉద్యోగం పట్ల విముఖత వ్యక్తంచేశారు. ఆయన అనుమతితో క్లర్కు ఉద్యోగానికి రాజీనామా చేసిన గోపాలకృష్ణయ్య గుంటూరులోని కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరారు. ఆ తర్వాత అక్కడే ఒక క్రైస్తవ మిషన్ స్కూలులో టీచరుగా చేరారు.

అనంతరం 1911లో స్కాట్లండ్‌లోని ఎడిన్‌బరో యూనివర్సిటీలో చదువుకోవటానికి బ్రిటన్ వెళ్లారు. అక్కడ 1916లో చరిత్ర, అర్థశాస్త్రాల్లో ఎం.ఎ. డిప్లొమా పొందారు. ఆ కాలంలో బ్రిటన్ సందర్శనకు వచ్చిన మహాత్మా గాంధీని తొలిసారి గోపాలకృష్ణయ్య కలిశారు. ఐదేళ్ల పాటు బ్రిటన్‌లో ఉన్న తర్వాత తిరిగి ఇండియాకు వచ్చారు.

రాజమండ్రిలోని ట్రైనింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరారు. కానీ అక్కడ ప్రిన్సిపల్‌తో విభేదాలు రావటంతో తొమ్మిది నెలలకే ఆ ఉద్యోగం వదిలేశారు. అనంతరం మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో టీచర్‌గా చేరారు. కానీ 8 నెలల తర్వాత ఆ ఉద్యోగం కూడా వదిలిపెట్టారు. మచిలీపట్నం విడిచి కొన్ని నెలలు కూచినపూడి, గుంటూరుల్లో గడిపారు.

గోపాలకృష్ణయ్య 1920లో మహానంది ప్రావిన్షియల్ కాన్ఫరెన్స్‌లో కనిపించారు. ''అప్పుడు ఆయన పాశ్చాత్య నాగరికతకు సంబంధించిన అన్ని ఆనవాళ్లనూ పక్కనపడేసి.. ప్రాచీన పండితుల శైలిని అనుకరిస్తూ ధోతీ, కండువా, పూసల దండ, నుదుట విభూది నామాలతో త్రినేత్రుడైన శివుడి లాగా'' వచ్చారని బి.వి.అప్పారావు తన పుస్తకంలో రాశారు. తనను విమర్శించిన వారికి జవాబు చెప్తూ.. తాను శంకరుడి అవతారాన్నని, మహానంది అడవుల్లో సుంకర కొండయ్యగా పునర్జన్మించానని దుగ్గిరాల ప్రకటించుకున్నారు.

అయితే.. గోపాలకృష్ణయ్యకు 14 ఏళ్ల వయసు కూడా నిండకముందే 1903లో పెళ్లి చేశారు. ఆయన భార్య దుర్గా భవాని వయసు అప్పటికి ఆయన వయసుకన్నా తక్కువే. ఆమెది కూడా కూచినపూడి గ్రామమే. వీరికి కోదండ రామమూర్తి అనే కొడుకు ఉన్నారు. గోపాలకృష్ణయ్య భార్య అనారోగ్యంతో ఉండేవారు. దీంతో ఆమెను ఏదైనా ఆరోగ్యవంతమైన ప్రదేశానికి తీసుకెళ్లాలని, అక్కడే శాశ్వతంగా నివసిస్తూ.. తన ఆలోచనలకు అనుగుణంగా ఒక విద్యా పీఠాన్ని స్థాపించాలని, ఒక పత్రికను ముద్రించి నడపాలని భావించారు.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

చీరాలకు నివాసం... ఉద్యమ ప్రవేశానికి నేపథ్యం...

అందుకు అనువైన ప్రాంతంగా చీరాలను ఎంచుకున్నారు. ఆయన తన కుటుంబంతో సహా చీరాల చేరుకున్నపుడు అక్కడి ఒక వైద్యుడు మినహా మిగతా అందరూ ఆయనకు అపరిచితులే. అక్కడ వాడరేవు సమీపంలో సముద్ర తీరం వద్ద స్థలం సంపాదించి తన విద్యా పీఠాన్ని ప్రారంభించాలని తలచారు. కానీ అక్కడికి రోడ్డు, ఇతరత్రా సదుపాయాలు లేకపోవటంతో చీరాలకు ఒక మైలు దూరంలో స్థలాన్ని ఎంచుకున్నారు.

అక్కడ తనకు భూమి కేటాయించాలని కోరుతూ డివిజనల్ మెజిస్ట్రేట్‌ను సంప్రదించారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. భూమి పొందటానికి అవసరమైన ఏర్పాట్లు సమీకరించుకోవాలని, ఒక విద్యా సంఘాన్ని స్థాపించి, ఇండియన్ సొసైటీస్ చట్టం కింద రిజిస్టర్ చేయించాలని సూచించారు. అవి పూర్తయితే భూమి కేటాయించే అంశాన్ని తాను పరిగణనలోకి తీసుకోగలనని చెప్పారు.

దీంతో గోపాలకృష్ణయ్య శ్రీమత్ ఆంధ్ర విద్యా పీఠ గోష్టిని ఏర్పాటు చేసి, 1920 జూన్ 22న రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత ఆ సొసైటీ కోసం ప్రభుత్వం నుంచి 58 ఎకరాల భూమి కేటాయింపు పొందారు. దీనికి సంబంధించి లాంఛనమైన ఉత్తర్వులు ఆయనకు అందాయి. ఆ తర్వాత రెండు రోజులకు విజయవాడలో మహాత్మా గాంధీ ప్రసంగాన్ని దుగ్గిరాల అనువదించాల్సి వచ్చింది.

అది ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. గోపాలకృష్ణయ్యకు భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నాలుగు రోజుల్లోనే.. ఆయనకు కేటాయించిన భూమిలోకి, ఆయన ప్రవేశించటానికి వీలు లేదని ఆదేశిస్తూ మరో ఉత్తర్వును పంపించింది ప్రభుత్వం. దీంతో దుగ్గిరాల ఆగ్రహంతో రగిలిపోయారు.

''ఆ భూమి తన జీవిత భాగస్వామి లాంటిదని, తన జీవితాశయం కోసం అక్కడ పనిచేసుకోవచ్చునని గోపాలకృష్ణయ్య నిజంగా విశ్వసించారు. కానీ ఏళ్లుగా ఆయన ఎంతగానో ప్రేమించిన భూమిని ప్రభుత్వం ఇచ్చినట్లే ఇచ్చి అందులో అడుగు పెట్టే హక్కును నిరాకరించింది. దేశాన్ని కానీ, భూమిని కానీ తండ్రి గానో తల్లి గానో భావించటం కాదు, తన భార్యగా భావించటం ఆయన రాజకీయ తాత్వికత. అలాంటి 'తన జీవిత భాగస్వామిని తాను కలవకుండా' ప్రభుత్వం అడ్డుకోవటంతో ఆయన ఆగ్రహానికి అవధులు లేకుండా పోయాయి'' అని 'ఆంధ్రరత్న డి. గోపాలకృష్ణయ్య - లైఫ్ అండ్ మెసేజ్' అనే పుస్తకంలో గుమ్మడిదల వెంకట సుబ్బారావు అభివర్ణించారు.

''గోపాలకృష్ణయ్య సహాయ నిరాకణ ఉద్యమంలో ఎందుకు చేరారు, చేరడమే కాకుండా.. తాను ఎంచుకున్న భూమిని తనకు దూరం చేసిన 'రాక్షస' ప్రభుత్వ వ్యవస్థ మీద అంత ఉగ్రంగా ఎందుకు పోరాడారనే దానిని ఇది విశదీకరిస్తుంది. తన భూమి మీద తన భర్తృత్వం కోసం పోరాడి గెలవటమనేది ఆయనకు వ్యక్తిగత ప్రతిష్టగా మారింది'' అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

''ఆ విధంగా 'ఏడాదిలోగా స్వరాజ్యం సాధించాల'న్న ఆశతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1920లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు. 'విజయమో, మరణమో' అన్నది ఆయన ప్రతిజ్ఞ. ఆయన పోరాటానికి చీరాల యుద్ధరంగమైంది.''

సహాయ నిరాకరణ ఉద్యమ గాలులు...

అప్పటికి దేశంలో జాతీయోద్యమం చాలా తీవ్రంగా సాగుతోంది. పంజాబ్‌లో జలియన్‌వాలాబాగ్ ఊచకోత జరిగింది. కాంగ్రెస్ పిలుపుతో దేశమంతటా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అహింసాయుత సహాయ నిరోకరణోద్యమం చెలరేగుతోంది. ఆంధ్రదేశాన్ని కూడా ఆ ఉద్యమ గాలులు బలంగా చుట్టేశాయి. అదే సమయంలో చీరాల - పేరాల ప్రజలు మునిసిపాలిటీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గోపాలకృష్ణయ్య ఆ ఉద్యమాల్లోకి వచ్చారు.

చీరాల శివార్లలో ప్రభుత్వం తనకు కేటాయించి, ఆ వెంటనే అందులో అడుగు పెట్టవద్దని ఆదేశించిన 58 ఎకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేటుగా భూమిని సమీకరించుకున్నారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. పేరాలకు చెందిన ఐదుగురు వ్యక్తులకు దరఖాస్తు చేసుకుని సుమారు 18 ఎకరాల భూమిని పొందారు. దానికి రామనగరు అని పేరు పెట్టారు. అక్కడ ముగ్గురు, నలుగురు యువకులను సమీకరించి తన పనిని ప్రారంభించారు. సత్యనారాయణ ప్రెస్ పేరుతో ముద్రణ ప్రెస్‌ను ప్రారంభించాలని తలచారు. సాధన పేరుతో ఒక తెలుగు వారపత్రికను, మరొక ఇంగ్లిష్ వారపత్రికను ముద్రించాలనేది ఆలోచన. ఆ పత్రికలకు సంపాదకుడిగా, ప్రచురణకర్తగా గోపాలకృష్ణయ్య తన పేరును ప్రకటించారు.

మరోవైపు.. 1920 సెప్టెంబర్‌లో లాలా లజపతి రాయ్ అధ్యక్షతన కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం.. సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలనే తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సమావేశానికి ఆంధ్రదేశం నుంచి కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తదితురులు హాజరై మద్దతు తెలిపారు. రెండు నెలల తర్వాత 1920 డిసెంబర్‌లో నాగ్‌పూర్ కాంగ్రెస్ సమావేశంలో సహాయనిరాకరోణద్యమ తీర్మానాన్ని పునరుద్ఘాటిస్తూ 1921 నాటికి.. అంటే ఏడాదిలోగా భారతదేశంలో స్వరాజ్యం స్థాపించాలనే కార్యక్రమాన్ని నిర్దేశించింది.

మహాత్మా గాంధీ ఇచ్చిన సహాయ నిరాకరణోద్యమ పిలుపులో గోపాలకృష్ణయ్య మమేకమయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.

1921 మార్చి 31 నుండి ఏప్రిల్ 1 వరకు విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటి సమావేశమైంది. ఈ సమావేశానికి మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, మహమ్మదు ఆలీ, షౌకత్ ఆలీ మొదలైన ప్రముఖ జాతీయ నాయకులు హాజరయ్యారు. వారిని చూడటానికి ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది జనం వెల్లువెత్తారు.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

గోపాలకృష్ణయ్య 'రామదండు'

ఏడాదిలో స్వరాజ్యం సాధించాలన్న లక్ష్యంతో జాతీయోద్యమంలోకి వచ్చిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.. అప్పటికే 'రామదండు' పేరుతో ఒక దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ నాటి కాలంలో.. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఏవైనా విపత్తులు, యుద్ధాలు, కరవులు వంటి అత్యవసర పరిస్థితుల్లో జనం 'రామదండు' పేరుతో స్వచ్ఛంద సహాయక బృందాలుగా ఏర్పడటం పరిపాటి. అయితే.. స్వరాజ్యం, స్వదేశీ సంప్రదాయాల పునరుద్ధరణ లక్ష్యంగా గోపాలకృష్ణయ్య తన రామదండును ఏర్పాటు చేశారు.

నిజానికి ఈ రామదండును ఆంధ్రదేశమంతటా ఒక పెద్ద వ్యవస్థ లాగా విస్తరించాలన్నది ఆయన ప్రణాళికగా గుమ్మడీదల వివరించారు. రామదండుకు ఒక రాజ్యాంగం, విధివిధానాలను కూడా దుగ్గిరాల రచించారు. దానిప్రకారం.. రామదండు గ్రామ సభకు అధిపతిగా 'వర్మ', మంత్రి - పూజారిగా 'శర్మ', కోశాధికారిగా 'గుప్త', సేవకుడిగా 'దాసు' ఉంటారు. అలాంటి 50 గ్రామాల సభలకు చెందిన వర్మ, శర్మలు సభ్యులుగా తాలుకా సభ ఉంటుంది. వీళ్లందరూ కలిసి సభ అధ్యక్షుడిగా ఒక 'రావు'ను ఎన్నుకుంటారు. ఒక జిల్లాలోని ఇలాంటి 'రావు'లందరూ జిల్లా సభలో సభ్యులుగా ఉంటారు. వారు తమ అధిపతిగా ఒక 'పంతులు'ను ఎన్నుకుంటారు. ఆంధ్రాలోని ఇలాంటి జిల్లా సభల అధిపతులందరూ కలిసి తమ సర్వాధిపతిని ఎన్నకుంటారు. ఆయనను 'రామదాసు' అని కానీ, 'హనుమాన్' అని కానీ, 'జగన్నాథ్' అని కానీ, 'నాయక్' అని కానీ పిలవాలి. ఈ పెద్దల సభ రామదండుకు ధర్మ సభగా వ్యవహరిస్తుంది.

కాంగ్రెస్ సమావేశానికి హాజరవటానికి గోపాలకృష్ణయ్య దాదాపు వెయ్యి మంది రామదండు సైనికులను వెంటబెట్టుకుని రైలులో బెజవాడ చేరుకున్నారు.

మరోవైపు ఆ సభ దగ్గర ప్రజల వెల్లువను నియంత్రించటానికి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వలంటీర్ల బృందం విఫలమైంది. మూడో రోజున కాంగ్రెస్ నాయకులు గోపాలకృష్ణ సాయం కోరారు. ఆయన రామదండును వెంటబెట్టుకుని ప్రజలను నియంత్రించటంలో, తోపులాటలు లేకుండా వరుసల్లో ఒక పద్ధతిగా నిలపటంలో సఫలమయ్యారు. గోపాలకృష్ణయ్య, రామదండు.. గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతల అభినందనలు పొందింది.

తిలక్ స్వరాజ్య నిధి కోసం కోటి రూపాయలు సేకరించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ సమావేశం తర్వాత గాంధీ ఆంధ్రదేశంలో పర్యటించారు. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, చీరాల, నెల్లూరు మొదలైనచోట్ల బహిరంగ సభల్లో ఉపన్యసించారు.

1921 ఏప్రిల్ 7వ తేదీన ఆయన చీరాల వచ్చారు. ఆ ఊరి శివార్లలో గోపాలకృష్ణయ్య స్థలంలో 'రామనగరు'కు శంకుస్థాపన చేశారు.

చీరాల - పేరాలలో 'మునిసిపాలిటీ' ఆందోళనలు

అప్పటికే చీరాల - పేరాల ప్రజలు.. తమ ఊర్లను 'మునిసిపాలిటీ' చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఆ నాటికి.. చీరాల, పేరాల, పాత చీరాల, జాండ్ర పేట అనే నాలుగు గ్రామాలు కలిపి ఒక పంచాయతీ యూనియన్‌గా ఉండేవి. చీరాల - పేరాలను పంచాయతీ యూనియన్ నుంచి వేరు చేసి మునిసిపాలిటీగా చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక.

నిజానికి చీరాలను మునిసిపాలిటీగా చేయాలని 1914 నుంచీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు జిల్లాలో 1914లో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు చీరాల కూడా ప్రభావితమైంది. చాలా మంది చనిపోయారు కూడా. చీరాలను పంచాయతీ యూనియన్‌ నుంచి మునిసిపాలిటీగా చేయాలని సానిటరీ కమిషన్ సిఫారసు చేసింది. కానీ ఇక్కడి ప్రజలు మునిసిపాలిటీ పన్నుల భారం భరించే పరిస్థితిలో లేరని, కాబట్టి చీరాలను మునిసిపాలిటీగా చేయాల్సిన అవసరం లేదని నాటి జిల్లా కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

''నిజానికి ఒంగోలు 1876 నుంచే మునిసిపాలిటీగా ఉన్నా కూడా 1914లో ప్లేగు వల్ల అక్కడ కూడా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. అప్పుడు చాలా మంది జనం ఒంగోలు విడిచి ఊరి బయట తాటాకు పాకల్లో నివసించారు. ఒంగోలు వీధులు నిర్మానుష్యమయ్యాయి. కాబట్టి మునిసిపాలిటీ పాలనలోని పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుగా ఏమీ ఉండబోదనటానికి ఒంగోలు పరిస్థితే ఉదాహరణ'' అని నాటి ఉద్యమనేతలు కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు 'ది చీరాల - పేరాల ట్రాజెడీ - యాన్ ఎపిసోడ్ ఆఫ్ వాలంటరీ ఎక్సైల్' అనే పుస్తకంలో జి.వి.కృష్ణారావు రాశారు.

కానీ చీరాల - పేరాలను మునిసిపాలిటీగా చేయనున్నట్లు 1919 నవంబరులో మద్రాసు (ప్రెసిడెన్సీ) ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జాండ్రపేట, పాత చీరాల గ్రామాలను చీరాల - పేరాల నుంచి విడదీసి ఒక పంచాయతీ యూనియన్‌గా కొనసాగించటం జరుగుతుందని చెప్పింది. దీనిపై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలుంటే నిర్దిష్ట తేదీ లోగా ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించింది.

ఈ ప్రకటనతో చీరాల - పేరాల ప్రజలు నిర్ఘాంతపోయారు. మునిసిపాలిటీని చేయటం తగదని, అంత భారీ పన్నులు కట్టలేమని ప్రభుత్వానికి పిటిషన్లు సమర్పించారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించటానికి కొంత మంది ప్రతినిధులను మద్రాసు కూడా పంపించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు.

చివరికి 1920 జనవరిలో చీరాల - పేరాలను మునిసిపాలిటీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌ను మునిసిపల్ చైర్మన్‌గా, మరో 11 మందిని కౌన్సిలర్లుగా పురపాలక సంఘాన్ని కూడా నామినేట్ చేసింది. ఈ రెండు గ్రామాలకు కలిపి అప్పటి వరకూ 4,000 రూపాయలుగా ఉన్న వార్షిక పన్నులను 33,000 రూపాయలకు పెంచింది.

ఆనాటికి ''చీరాల - పేరాల జనాభాలో దాదాపు 90 శాతం మంది బట్టలకు రంగుల అద్దకం, చేనేత పనులు చేస్తూ జీవిస్తున్నారు. వారికి రోజుకు 4 లేదా 5 అణాలు మాత్రమే కూలీ కింద లభించేది. పంట పొలాలు కూడా నాణ్యమైనవి కావు. తయారీ పరిశ్రమలు చాలా తక్కువ. కేవలం ఒకే ఒక్క రైస్ మిల్లు ఉంది'' అని ఆ నాటి హిందూ దినపత్రిక రాసింది.

ఇలాంటి పేద ప్రజలకు.. ఇప్పటికే చెల్లిస్తున్న పన్నుల కన్నా ఏకంగా తొమ్మిది, పది రెట్లు ఎక్కువ పన్నులు చెల్లించాలని అకస్మాత్తుగా చెప్తే.. అది తీవ్రమైన అణచివేతగా వారు భావించారు. దీనికితోడు.. కౌన్సిల్ ఏర్పాటయ్యాక కౌన్సిలర్లు కూడా వేధింపులకు పాల్పడ్డారు.

ఈ పరిస్థితుల్లో జనం 1920 ఫిబ్రవరి 18న 'రేట్ పేయర్స్ అసోసియేషన్' ఏర్పాటు చేశారు. కొత్తగా పెరిగిపోయిన భారీ పన్నుల మీద కొత్త మునిసిపల్ చైర్మన్‌కు చాలా మంది ఫిర్యాదులు చేశారు. అయితే.. తొలుత పన్నులు చెల్లించాలని, ఆ తర్వాత ఈ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ పై అధికారులకు ఫిర్యాదులు చేయాలని చైర్మన్ సలహా ఇచ్చారు.

ఈ సలహాను పాటించిన జనం సగం ఏడాదికి పన్నులు కట్టారు. ఆ తర్వాత ఇంత భారీ పన్నులు అన్యాయమంటూ పై అధికారులకు విజ్ఞాపనలు పంపించారు. కోర్టుల్లో కేసులు వేశారు. కానీ డబ్బులు ఖర్చయ్యాయే తప్ప ఫలితమేమీ కనిపించలేదు.

చివరికి విసుగెత్తిన జనం మునిసిపాలిటీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. మునిసిపల్ కౌన్సిలర్లందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ పరిణామంతో జిల్లా కలెక్టర్ చీరాల వచ్చారు. మునిసిపాలిటీని రద్దు చేయాల్సిందిగా సిఫారసు చేయాలని జనం కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమయంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రంగంలోకి దిగారు. చీరాల ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించారు.

https://twitter.com/DravidianForum/status/1545651576056205312

పానుగంటి రాజా ఉత్తర్వులు.. చీరాలలో అల్లర్లు

అప్పటి మద్రాసు ప్రభుత్వంలో స్థానిక స్వయం పరిపాలన మంత్రి పానుగంటి రాజా (రాజా రామారాయానింగర్ - ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు).. 1921 ఫిబ్రవరిలో చీరాలను సందర్శించారు. మునిసిపాలిటీని రద్దు చేయాలని కోరుతూ జనం తమ ప్రతినిధులను ఆయన వద్దకు పంపించారు. కానీ మంత్రి వారి మాటలు పట్టించుకోలేదు.

''పానుగంటి రాజా ఆనాడు అబ్రాహ్మణ ఉద్యమ అగ్రనాయకుల్లో ఒకరు. చీరాల-పేరాల ఉద్యమం సహాయనిరాకరణ ఉద్యమకారుల చేతుల్లోకి, బ్రాహ్మణుడైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చేతుల్లోకి జారిపోతుండటాన్ని చూసి.. చీరాల-పేరాల మునిసిపాలిటీ విషయంలో ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గలేదు'' అని గుమ్మడీదల తన పుస్తకంలో పేర్కొన్నారు.

చీరాల - పేరాల మునిసిపాలిటీకి జీతం చెల్లించి చైర్మన్‌ను నియమిస్తామని, పోలీసు బలగాలను మోహరిస్తామని, రైల్వే స్టేషన్‌ను, పోస్టాఫీసును, హాస్పిటల్‌ను తొలగిస్తామని బెదిరించారు. మునిసిపాలిటీకి జనం ఒప్పుకోకపోతే సైన్యాన్ని కూడా దించుతామని హెచ్చరించారు.

''ఆయన హెచ్చరికలు గ్రామస్తుల మీద ప్రభావం చూపలేదు. దీంతో మంత్రి నిడుబ్రోలు గ్రామ మునసబు సాయంతో కొందరు బ్రాహ్మణేతరులను పిలిపించారు. వారి కులాభిమానాన్ని ప్రేరేపిస్తూ, మునిసిపల్ కౌన్సిల్‌కి వారిని నామినేట్ చేస్తామనే ఆశలు కల్పించి తనవైపు ఆకర్షించటానికి ప్రయత్నించారు. కానీ ఆయన దారుణంగా విఫలమయ్యారు'' అని గుమ్మడీదల తన పుస్తకంలో రాశారు.

1921 మార్చిలో చీరాల - పేరాలకు చెందిన 12 మంది పన్నులు కట్టటానికి నికారించారు. వారిలో రావూరి అలమేలు మంగమ్మ అనే మహిళ సహా ఐదుగురిని ప్రభుత్వం 20 రోజుల పాటు జైలుకు పంపించింది. జాతీయోద్యమం గాంధీ నేతృత్వంలోకి వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ నేరం కింద అరెస్టయిన తొలి మహిళ బహుశా ఆమే కావచ్చు.

పానగంటి రాజా మద్రాసు తిరిగి వెళ్లాక చీరాల మునిసపల్ కౌన్సిల్‌ను రద్దు చేసి, జీతమిచ్చి చైర్మన్‌ను ఎందుకు నియమించరాదో వివరణ ఇవ్వాలంటూ అధికారికంగా నోటీసు పంపించారు. పురపాలక సంఘం సమావేశమై.. భారీ పన్నులను ప్రజలు భరించలేరని, గ్రామస్తులకు మునిసిపాలిటీ అవసరం లేదని, కాబట్టి ప్రజల అభీష్టం మేరకు పాత గ్రామాల యూనియన్‌ను పునరుద్ధరించాలని మంత్రిని కోరుతూ తీర్మానించింది.

కానీ మునిసిపాలిటీ తీర్మానాన్ని పెడచెవిన పెట్టిన మంత్రి.. మునిసిపల్ కౌన్సిల్‌ను రద్దు చేసి, నెలకు రూ. 390 జీతంతో చైర్మన్‌ను నియమిస్తూ 1921 ఏప్రిల్ 1న ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన జనం అల్లర్లకు దిగారు. టోల్-గేట్‌ను దగ్ధం చేసి, టోల్-బార్‌ను రైలుపట్టాల మీద అడ్డంవేశారు. కలకత్తా మెయిల్‌ను అడ్డుకున్నారు.

అప్పుడు మద్రాసు ప్రభుత్వంలోని పబ్లిసిటీ బ్యూరో ఒక ప్రకటన జారీ చేసింది. ప్రజల ప్రయోజనాల కోసమే మునిసిపాలిటీని చేస్తున్నామని ఆ ప్రకటనలో వివరించటానికి ప్రయత్నించింది. చీరాలలో చేనేత, అద్దకం పరిశ్రమ విరాజిల్లుతోందని, గుంటూరు జిల్లాలోని అతి పెద్ద వ్యాపార కూడళ్లలో చీరాల ఒకటని, మునిసిపాలిటీ చేస్తే పెరిగే అదనపు పన్నులు చెల్లించే సామర్థ్యం చీరాలకు ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. చీరాల పట్టణంలో పారిశుధ్యం పరిస్థితి బాగోలేదని, పంచాయతీ యూనియన్‌ను మునిసిపాలిటీగా మార్చటం వల్ల పరిస్థితి మెరుగుపడుతుందని పబ్లిసిటీ బ్యూరో చెప్పింది.

గాంధీ రాకతో మలుపు తిరిగిన ఉద్యమం

మరోవైపు.. 1921 మార్చి చివర్లో, ఏప్రిల్ మొదట్లో బెజవాడ కాంగ్రెస్ సమావేశం ముగిసిన తర్వాత గాంధీ 1921 ఏప్రిల్ 6న చీరాల వచ్చారు. ఆయన రాక చీరాల - పేరాల ఉద్యమాన్ని మలుపు తిప్పింది.

మునిసిపాలిటీని వ్యతిరేకించి జైలుకు వెళ్లిన మహిళ సహా 12 మందికి గాంధీ పూలమాలలు వేసి గౌరవించారు. దక్షిణాఫ్రికాలో తాను కూడా అనేక మార్లు జైలుకు వెళ్లానని, జైలు గోడల మధ్యే స్వాతంత్ర్యం ఎక్కువగా ఉంటుందని తనకు అనిపించిందని, అందుకే జైలుకు వెళ్లే భాగ్యం కలిగిన వారిని చూస్తే తనకు అసూయగా ఉంటుందని గాంధీ ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మునిసిపాలిటీని బలవంతంగా రుద్దటం ద్వారా పెద్ద తప్పు చేసిందని తను భావిస్తున్నట్లు చెప్పారు.

ఈ విషయంలో చీరాల ప్రజలు అనుసరించాల్సిన కార్యాచరణ గురించి గాంధీ సలహాను కోరగా.. వారికి రెండు మార్గాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఒకటి శాసనోల్లంఘన చేస్తూ సహాయ నిరాకరణ చేయటం, లేదంటే ముస్లింల లాగా హిజ్రత్ కానీ, తులసీదాస్ చేసినట్లుగా 'దేశత్యాగం' కానీ చేయటం. ఈ రెండు ఆయుధాలకూ ఒకే విధమైన బలం, ప్రభావం ఉంటాయన్నది తన అభిప్రాయంగా చెప్పారు.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్థలంలో రామనగరు గ్రామానికి గాంధీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయనకు గోపాలకృష్ణయ్య వీడ్కోలు పలికారు.

శాసనోల్లంఘన అంటే ప్రజలు పన్నులు చెల్లించటానికి తిరస్కరించి, తమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటానికి, అవసరమైతే పెద్ద సంఖ్యలో జైళ్లకు వెళ్లటానికి సిద్ధపడాలి. ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే ప్రజలు ఏ క్షణంలోనైనా సహనం కోల్పోవచ్చునని, అధికార యంత్రాంగంతో ఘర్షణకు దిగవచ్చునని దుగ్గిరాల, ఇతర నేతలు భావించారు.

భోగరాజు పట్టాభి సీతారామయ్య రాసిన దాని ప్రకారం.. ''ప్రజలకు మునిసిపాలిటీ ఇష్టం లేకపోయినట్లయితే, వారు ఆ మునిసిపాలిటీ పరిధి నుంచి బయటకు వెళ్లి నివసించవచ్చునని గాంధీ సూచించారు. ప్రజలు పూర్తిగా, విజయవంతంగా ఖాళీ చేసినట్లయితే మునిసిపాలిటీ దానికదే అంతమైపోతుంది అని చెప్పారు''.

ఇది గాంధీ అప్పటికే ప్రారంభించిన అహింసాయుత సహాయ నిరాకరణకు అనుగుణంగా ఉందని, దీనివల్ల ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష ఘర్షణకు తావుండదని భావించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.. చీరాల పట్టణం నుంచి ప్రజలు ఖాళీ చేయాలని నిర్ణయించారు.

అప్పటికే గాంధీ సహాయ నిరాకరణోద్యమ స్ఫూర్తిని నింపుకున్న జనం.. ఊర్లో తమ పూర్వీకుల ఇళ్లు ఖాళీ చేసి, ఊరవతల పూరిళ్లు, పర్ణశాలల్లో నివసించాలన్న దుగ్గిరాల పిలుపుకు తక్షణమే స్పందించారు.

ఇళ్లు విడిచి, ఊళ్ళు విడిచి వేలాది మంది జనం వలస

ఏప్రిల్ 25వ తేదీ రాత్రి. మేళతాళాలతో జనం బయలుదేరారు. 'మహాత్మా గాంధీ - జిందాబాద్' నినాదాలు చేస్తూ నడక మొదలుపెట్టారు. ఆనాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షి బసవరాజు అప్పారావు ఇలా రాశారు: ''ఆ నడివేసవి రాత్రి ఆడవాళ్లు మగవాళ్లు, పెద్దలు, పిల్లలు తమ రోజు వారీ వస్తువులను చేతపట్టుకుని తమ పాత ఇళ్లు వదిలేసి కొత్త నివాసానికి బయలుదేరటం చూస్తే నేను తట్టుకోలేకపోయాను. నా కళ్ల నుంచి నీళ్లు వచ్చేశాయి''.

చీరాల - పేరాల ప్రజలు 1921 ఏప్రిల్ 25వ తేదీ రాత్రి తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు. గ్రామ శివార్లలో 'రామనగర్' పేరుతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్థాపించిన నివాస ప్రాంతంలో ఒక గృహ సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

''మొత్తం 15,326 మంది జనాభాలో 13,752 మంది గ్రామస్తులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు'' అని 'ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర' పుస్తకంలో పి.రఘునాథరావు రాశారు.

చీరాల నుంచి ప్రజలు తరలిపోవటం గురించి 1921 ఏప్రిల్ 26వ తేదీన ద హిందు దినపత్రిక ఇలా వివరించింది: ''చీరాల, పేరాల ఖాళీ చేయటం వేగంగా జరుగుతోంది. సామాన్లతో నిండిన ఎండ్ల బండ్ల వరుసలు, వ్యాపారులు వారి సరకులతో పాటు ఈ గ్రామాల నుంచి నిరంతరాయంగా వెళ్లిపోతున్నారు. పేదవాళ్లు ఆడా మగా తమ సామాన్ల మూటలను తలల మీద మోసుకుంటూ పోతున్నారు. అన్ని వర్గాల ప్రజలూ ఆనందంగా పాలుపంచుకుంటున్నారు. కూలికి పనిచేస్తున్న చైర్మన్ కొంత అణచివేత కలిగిస్తున్నప్పటికీ.. ప్రజలు మహాత్ముడి సలహాను కచ్చితంగా పాటిస్తున్నారు. చీరాల, పేరాల నిజంగా ధీరుల నెలవులు. ఈ ప్రాంతాలకు, వీరి నాయకుడు గోపాలకృష్ణయ్యకు అభినందనలు దక్కాలి''.

ద హిందు స్పెషల్ కరస్పాండెంట్ డి.ఎస్.ఆర్. రావు 1921 మే ఆరంభంలో చీరాల - పేరాలను సందర్శించారు. ''చీరాల నివాసుల్లో దాదాపు 75 శాతం మంది, పేరాల జనంలో దాదాపు 50 శాతం మంది తమ పాత ఇళ్లను ఖాళీ చేశారు. స్తోమత గలవాళ్లు పొరుగు గ్రామాల్లో ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. కానీ అత్యధిక జనం వెదురు కర్రలు, తాటాకులతో నిర్మించిన పర్ణశాలల్లో ఉంటున్నారు. వీరు, వారి సామాన్లు తమ పాత ఇళ్ల నుంచి కొత్త పర్ణశాలలకు తరలిపోవటం విచారకరమైన దృశ్యం. చీరాలలో ఒక్కో వీధి నిర్మానుష్యంగా మారింది. అందమైన ఈ ఊరి వీధుల్లో ఒక్క గొంతు కూడా వినిపించటం లేదు. బరువుగా వెళుతున్న ఎడ్లబండ్ల కిర్రు చప్పుళ్లు, సమ్మెట దెబ్బల మోతలు, ఎండిన తాటాకుల వాసన, మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు తమ వస్తువుల బరువులు మోస్తూ దుమ్మురేగుతున్న మట్టి దారుల్లో నెమ్మదిగా నడిచిపోతున్న దృశ్యం ఓ ముప్పిరిగొల్పే దృగ్విషయం. నిజంగా స్ఫూర్తిదాయకం'' అని ఆనాటి పరిస్థితిని అభివర్ణించారు.

అలా వెళ్లిన జనం రామనగరులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం ఉద్యమనాయకులు కొంత విరాళాలు సేకరించారు. కాంగ్రెస్ పార్టీ రూ. 3,000 విరాళంగా అందించింది. అయితే.. కొత్త ఊర్లో కొత్త ఇళ్ల నిర్మాణానికి చాలా డబ్బు ఖర్చయింది.

''ఊరి బయటకు మారటం ఈ ప్రజల ఆర్థిక జీవితాలను చాలా ఆటంకపరిచింది. ఈ పేద గ్రామీణులు రోజుల తరబడి వేతనాలు కోల్పోయారు. వారి కుటుంబం ఎంత పెద్దదనే దాన్ని బట్టి.. ఆ పర్ణశాలలు ఒక్కో దానికి రూ. 20 నుంచి రూ. 40 వరకూ ఖర్చయ్యాయి. తక్షణ అవసరమైన తాత్కాలిక బావులు ఒక్కో దానికి 5 రూపాయలు ఖర్చయితే శాశ్వతంగా తవ్విన బావులు ఒక్కో దానికి 50 రూపాయలు ఖర్చయింది. ఈ కొత్త ఆవాసం కోసం వీరు కనీసం రూ. 30,000 ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా కూడా.. ఊర్లు ఖాళీ చేయటం కొనసాగింది. జనం గౌరప్రదంగా ఈ భారాన్ని భరించారు'' అని డి.ఎస్.ఆర్ రావు ద హిందు పత్రిక కథనంలో వివరించారు.

''ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన మనసంతా కేంద్రీకరించి నిర్వహించిన ఈ వలస.. గతంలో సింధ్ ప్రాంత ముస్లింలు అఫ్గానిస్తాన్‌కు సాగించిన హిజ్రాను మనకు తలపుకు తెస్తుంది'' అని డాక్టర్ పట్టాభి సీతారామయ్య తన పుస్తకంలో వివరించారు.

చీరాల పేరాల ఉద్యమం గురించి గాంధీజీ తన 'యంగ్ ఇండియా' పత్రికలో ఈ విధంగా రాశారు: ''నిజానికి చీరాల - పేరాల ఒకే గ్రామం. సముద్రానికి అల్లంత దూరంలో చక్కటి వాతావరణం. ఊరి జనాభా 15,000 మంది. వీరిపై పురపాలక సంఘాన్ని రుద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ప్రజలు దీనికి వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు. వీరి దృష్టిలో పురపాలక సంఘం అంటే ఏంటో చూద్దాం. చక్కటి పరిశుభ్రత కోసమా? కాదు. ప్రజలు ఇదివరకే సహాయ నిరాకరణోద్యమంలో మునిగి ఉన్నారు. ఇది కేవలం ఎక్కువ పన్నుల్ని గుంజడం కోసం, ప్రజల స్వేచ్ఛాస్వాతంత్ర్యాల్లో జోక్యం చేసుకోవడం కోసమే. ఇది ప్రజలు సహించలేని ఒక దుష్పరిణామం''.

కొత్త ఊరు రామనగరులో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మాట మీద పరిపాలన సాగేది. ఈ ఉద్యమానికి అన్ని వైపుల నుంచీ మద్దతు, ప్రశంసలు అందాయి. టంగుటూరి ప్రకాశం వంటి నేతలు రామనగరును సందర్శించారు.

ప్రజల ఉద్యమాన్ని భగ్నం చేయటానికి మునిసిపాలిటీ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రయత్నించారు. జనం ప్రయాణిస్తున్న ఎడ్ల బండ్లకు లైసెన్స్ లేదంటూ జప్తు చేసుకున్నారు. కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పొలిమేరలో జనం వేసుకున్న 200 గుడిసెలు ప్రభుత్వ పోరంబోకు భూములను ఆక్రమించి వేసుకున్నారని ఆరోపించారు. ఒక్కో గుడిసెకు రూ. 1026 చొప్పున జరిమానా కొట్టాలంటూ నోటీసులు జారీచేశారు.

దుగ్గిరాల అరెస్టు... చల్లారిన ఉద్యమం

కానీ జనం జంకలేదు. వెనుకంజ వేయలేదు. దాదాపు పదకొండు నెలల పాటు అక్కడే కొనసాగారు. అయితే ఈ ఉద్యమానికి నిధుల కొరత తీవ్రమైంది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించారు. కానీ రామనగరు ఖజానా నిండుకుంది. 1921 సెప్టెంబరు చివర్లో బరంపురంలో జరుగుతున్న ఆంధ్రమహాసభలో విరాళాలు సేకరించే లక్ష్యంతో గోపాలకృష్ణయ్య అక్కడికి వెళ్లారు. ఆ సమావేశంలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. అయితే.. రెండో రోజు ఆయనకు పోలీసులు నోటీసు అందించారు. రెండు నెలల పాటు బహరింగ సభల్లో ప్రసంగించరాదని గంజాం జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశమది.

కానీ ఆ ఆదేశాలను పాటించటానికి దుగ్గిరాల నిరాకరించారు. ''మీ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నేను ఈ రోజు సాంయత్రం ప్రసంగించబోతున్నాను. కావున తెలియజేయటమైనది'' అంటూ కలెక్టర్‌కు లేఖ రాసిన దుగ్గిరాల మరో సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవేశపూరితంగా ప్రసింగించారు.

అక్టోబర్ 1వ తేదీన గోపాలకృష్ణయ్య బరంపురం రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కటానికి సిద్ధమవుతుండగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు శ్రీకాకుళంలో గంజాం జిల్లా కలెక్టరు ముందు విచారణకు హాజరుపరిచారు. ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు కలెక్టర్ తీర్పు చెప్పారు. గోపాలకృష్ణయ్య పూచీకత్తు చెల్లించటానికి తిరస్కరించటంతో ఆయనను బరంపురం జైలుకు తరలించారు. అక్టోబరు 10వ తేదీన ఆయనను తిరుచినాపల్లి సెంట్రల్ జైలుకు పంపించారు.

చీరాల-పేరాలలో శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని గోపాలకృష్ణయ్య తన సహచరులకు సందేశం పంపించారు. ఆంధ్రా కాంగ్రెస్ కమిటీ నేతలు కొందరు ఈ ఉద్యమ బాధ్యతలు చేపట్టారు. టంగుటూరి ప్రకాశం పంతులు తరచుగా సందర్శిస్తానని చెప్పారు.

కానీ రామనగరులో ఆర్థిక కష్టాలు తీవ్రమవటంతో జనంలో నిస్పృహ మొదలైంది. పర్ణశాలలో కొత్త ఇళ్లు కట్టుకోవటానికి ఖర్చులకు తోడు.. ఉపాధి, వేతనాలు లేకపోవటంతో వారి ఆర్థిక వ్యవస్థ పతనమైంది. పూరిళ్లలో నివసిస్తూ విపరీతమైన ఎండలను, భారీ వర్షాలను ఎదుర్కొంటూ చాలా బాధలు పడ్డారు. ఇంకోవైపు మునిసిపాలిటీ యంత్రాంగం నోటీసులు, జప్తులు, జరిమానాలు అంటూ ఇబ్బందులు పెడుతూ ఉంది. ఇక చీరాల - పేరాల ఊర్లు నిర్మానుష్యం కావటంతో ఆ ఇళ్లు పాడుబడ్డాయి. దొంగలు తలుపులు, కిటికీలను కూడా ఎత్తుకెళ్లిపోయారు.

మరోవైపు.. 1922 ఫిబ్రవరిలో చౌరీచౌరాలో ఆందోళనకారులు ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి నిప్పుపెట్టారు. ఆ స్టేషన్‌లో ఉన్న పోలీసులు సజీవ దహనమయ్యారు. ఈ హింసాత్మక సంఘటనతో.. శాసనోల్లంఘన ఉద్యమాన్ని మహాత్మా గాంధీ నిలిపివేశారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమం కూడా చల్లారిపోయింది. ఈ పరిస్థితుల్లో రామనగరులోని జనం ఊర్లలోకి తిరిగివచ్చి తమ పాత ఇళ్లకు చేరుకోవటం మొదలుపెట్టారు. మునిసిపాలిటీని అంగీకరించి అక్కడే నివసించటం మొదలుపెట్టారు.

చీరాల - పేరాల ఉద్యమం మొదలైన 11 నెలలకు కుప్పకూలిపోయింది. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ సంఘీభావం తెలిపినప్పటికీ.. దీని సారథ్యాన్ని చేపట్టలేదు. ఈ పోరాటం చీరాల - పేరాల ప్రజలు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఒంటరిగా చేసిన పోరాటంగానే మిగిలిపోయింది. కాంగ్రెస్‌ నేతల మధ్య విభేధాలు, తగినన్ని నిధులు అందకపోవటం, ప్రభుత్వ యంత్రాంగం ఒత్తిడి.. ఈ ఉద్యమం అర్థంతరంగా విఫలమవటానికి ప్రధాన కారణాలని కొందరు పరిశీలకులు చెప్తారు.

1920లో జస్టిస్ పార్టీ నేతలు

'బ్రాహ్మణ సంస్కృతికి - అబ్రాహ్మణత్వానికి మధ్య' పోరాటం

చీరాల ఉద్యమం అనేది భారతదేశంలో కుహనా 'అబ్రాహ్మణతత్వా'నికి వ్యతిరేకంగా జరిగిన ఒక పోరాటమని.. 'ఆంధ్రరత్న డి. గోపాలకృష్ణయ్య - లైఫ్ అండ్ మెసేజ్' అనే పుస్తకంలో గుమ్మడీదల వెంకట సుబ్బారావు అభివర్ణించారు. ఈ పుస్తకం 1928లో తొలిసారి ప్రచురితమైంది.

ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణులు అధికంగా ఉండటంతో పాటు.. కుల వివక్షల కారణంగా 19వ శతాబ్దం చివర్లో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మద్రాసు కేంద్రంగా బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. బ్రాహ్మణేతర సంఘాలుగా మొదలైన ఆ ఉద్యమాలు 1916లో జస్టిస్ పార్టీగా ఏర్పాటయ్యాయి. నాటి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో బ్రాహ్మణేతరుల ప్రాతినిధ్యాన్ని పెంచాలని కోరుతూ దరఖాస్తులు అందించేది.

మరోవైపు.. నాటి బ్రిటిష్ ఇండియాలో పరిమితంగానే అయినా మరిన్ని ఎక్కువ అధికారాలతో భారతీయులకు స్వయం పాలనను ప్రవేశపెట్టటానికి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను అమలులోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 1920లో జరిగిన మద్రాస్ ప్రెసిడెన్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కానీ జస్టిస్ పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. అలా.. బ్రాహ్మణాధిపత్య వ్యతిరేకతతో ఏర్పాటై, బ్రాహ్మణేతరులతో కూడిన జస్టిస్ పార్టీ తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఆనాటి ఈ పరిణామాలపై గుమ్మడీదల తన పుస్తకంలో ఇలా వివరించారు:

''ఈ ప్రాంతంలో ప్రజలను విభజించి పాలించటానికి బ్రిటిష్ ప్రభుత్వం బ్రాహ్మణేతర ఉద్యమానికి రూపకల్పన చేసింది. ఉత్తర భారతదేశంలో హిందువులుగా, మహమ్మదీయులుగా విభజించింది. దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులు, అబ్రాహ్మణులు అని చీల్చింది.

బ్రాహ్మణులు, బ్రాహ్మణులు కాని వారు భారతదేశంలో అనాదిగా మనుగడలో ఉన్నారు. కానీ 'అబ్రాహ్మణులు' అనే మాటే కొత్త సృష్టి. భారతదేశ జనాభాలో అబ్రాహ్మణులు సుమారు 97 శాతం మంది ఉంటారని, వారిలో పలు కులాలు, జాతులు, మతాలు, భాషల వారు ఉంటారని, నానాజాతుల సముదాయమని, భారత సమాజం ఎంత భిన్నమైనదో అంత వైవిధ్యమైనదని వారు భావించారు.

దేశంలో అతి ఎక్కువ అభివృద్ధి చెందిన, ఎక్కువ నాగరికులైన వర్గమైన బ్రాహ్మణులు స్వీయ ప్రతిభ ద్వారా, సమాజంలో స్థాయి ద్వారా.. బ్రిటిష్ వారితో సంబంధాలను ఉపయోగించుకోగలిగిన తొలి వర్గం వారయ్యారు. ఇక వారి దిగజారిన, పతనమైన పరిస్థితుల్లో బ్రిటిష్ విద్య 'ఆశీర్వాదాలు' అందుకున్న వారు, తద్వారా బ్రిటన్ రాచరిక పాలనలో భారతీయులకు తెరిచిన గుమాస్తాలైన వారు, అధికారుల పోస్టులను అందుకున్న తొలి వార్గం వారూ బ్రాహ్మణులే అయ్యారు.

ప్రపంచమంతటా చిన్న మతాల సమాజాలన్నిటికీ స్వాభావికమైన స్వీయ పరిరక్షణ సహజాతంతో.. ఈ బ్రాహ్మణులు గత కొన్ని శతాబ్దాలుగా కేవలం స్వార్థ విధానాన్ని అవలంబిస్తుండటమే కాదు.. ఈ భూమినంతటినీ కమ్మేసిన చిమ్మచీకటి నీడలో వీరు తమ స్వీయ జ్ఞాన ఊటలను వట్టిపోనిచ్చారు. తమ సాటి మనుషులను అజ్ఞానంతో క్షీణించిపోనిచ్చారు. అలా ఈ దేశంలో నిజమైన జ్ఞానం అంతరించిపోయింది. ఒకప్పుడు ప్రపంచానికి దీపంగా, దేదీప్యంగా నిలిచిన ఈ దేశంలో ఇప్పుడు అత్యంత మూర్ఖమైన, అర్థంలేని మూఢనమ్మకాలు నిండిపోయాయి.

అబ్రాహ్మణులకు వారి సొంత సమస్యలు, ఫిర్యాదులు ఉన్నాయి. చాలా విషయాల్లో అవి చాలా న్యాయమైనవి. పవిత్రమైన ఆలయాల్లో వారికి ప్రవేశం లేదు. చాలా మంది పవిత్ర గ్రంథాన్ని - అంటే వేదాన్ని తాకజాలరు కూడా. వారికి పుట్టక కారణంగా మన సంస్కృతిలోని అతి సూక్ష్మ రహస్యాలను నేర్చుకోవటానికి, ఆచరించటానికి అనుమతి లేదు.

ఇక సమాజ శ్రేణుల్లో ప్రధానంగా తమ జన్మరీత్యా నిమ్నవర్గాలనే గుర్తును కూడా వారు మోస్తూ ఉంటారు. బ్రాహ్మణులుగా పుట్టని వారందరిలో ఈ ఆత్మన్యూనతా భావానికి దారితీసిన కారణాలను అంచనా వేయటం నిరర్థకం. కానీ ఇది ఇప్పుడు నిజం. మొత్తం వ్యవస్థను నీరుగారుస్తోంది. ఇది అన్నదమ్ములను పరస్పర శత్రువులుగా నిలుపుతోంది. సమాజం మీద సమాజాన్ని ప్రత్యర్థిగా చేస్తోంది.

కొన్ని ఉదంతాల్లో ఈ విభజన ఎంతవరకూ పోయిందంటే.. మనిషికి మనిషికి మధ్య (కులాల మధ్య) కలిసి భోజనం చేయకుండటం, పెళ్లి చేసుకోకపోవటం, అంటకుండా ఉండటం, కలవకుండా ఉండటం, చివరికి చూడటకుండా ఉండటం వరకూ వెళ్లింది. అంటే ఒక మనిషి తన సాటి మనిషిని చూడకూడదు. చూస్తే మలినమైపోతాడు. ఆ మలినమంతా జన్మతః వచ్చింది. ఒక మనిషి పుట్టుకతో బ్రాహ్మణుడు. మరొక మనిషి పుట్టుకతో చండాలుడు - అంటే పాపి. చాలా కాలం కిందటి విభిన్నమైన చరిత్రలో వాస్తవ అర్థం ఏమైనప్పటికీ ఇప్పుడిది దాదాపు అర్థంలేని మూఢనమ్మకంగా మారింది.

ఈ పరిస్థితుల్లో అబ్రాహ్మణ ఉద్యమం తొలుత పుట్టుకొచ్చింది. 'అబ్రాహ్మణుల'కు వ్యతిరేకంగా చాలా కఠినమైన పనులు చేసిన, పరుషమైన మాటలు అన్న బ్రాహ్మణలను వ్యతిరేకిస్తూ ఒక నిరసనగా కొంతవరకూ.. దక్షిణ భారతదేశంలో అధికార వ్యవస్థ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రచించిన ఎత్తుగడగా కొంతవరకూ ఈ ఉద్యమం ముందుకు వచ్చింది'' అని కూడా గుమ్మడీదల తన పుస్తకంలో వివరించారు.

1920 ఎన్నికల్లో జస్టిస్ పార్టీ గెలవటానికి.. ఆ ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించటంతో పాటు, బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగం ఆ పార్టీకి అందించిన సహకారం కూడా కారణమని గుమ్మడీదల అభిప్రాయపడ్డారు.

''1920 సంవత్సరంలో భారతదేశం యావత్తూ మహాత్మా గాంధీ వెనుక కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమంలో నడుస్తున్నపుడు.. మద్రాస్ 'అబ్రాహ్మణ' ప్రతినిధి సంస్థ అయిన కుహనా 'జస్టిస్' పార్టీ తనకు తాను పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం సరసన చేరింది. వారి అణచివేత, పీడన విధానానికి పూర్తిగా సహకారం అందించింది. చట్టసభలను కాంగ్రెస్ బహిష్కరించటంతో ఓ పిడికెడు మంది 'జస్టిస్ వాదులు' ఆ సీట్లకు.. అప్పటి గవర్నర్ అందించిన వ్యక్తిగత ప్రాపకం, సహకారంతో ఎన్నికవటం సులభమైంది. అలా 1921లో.. దేశంలో సహాయ నికారణ ఉద్యమం వెల్లువెత్తుతున్న దశలో - ఈ ప్రెసిడెన్సీలో 'జస్టిస్ పార్టీ' పాలన మొదలైంది'' అని ఆయన తన పుస్తకంలో రాశారు.

ఈ నేపథ్యంలో.. చీరాల - పేరాల ఉద్యమం 'బ్రాహ్మణ సంస్కృతికి - అబ్రాహ్మణవాదానికి' మధ్య పోరాటంగా ఎలా మారిందనేది కూడా గుమ్మడీదల చెప్పుకొచ్చారు.

''అప్పుడు మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల శాఖ బాధ్యతను జస్టిస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన పానుగంటి రాజాకు అప్పగించారు. నిస్సందేహంగా, అబ్రాహ్మణ ఉద్యమం అందించిన అతిగొప్ప నాయకుడు ఆయన. పోరాటయోధుడు. గోపాలకృష్ణయ్య శక్తికి నిజంగా తగిన శత్రువు ఆయన.

అలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చీరాల తరఫున తాను నిలవటం ద్వారా.. బ్రాహ్మణుడైన గోపాలకృష్ణయ్య.. ఓ గొప్ప అబ్రాహ్మణ నాయకుడి ఆగ్రహానికి ఎదురు నిలుచున్నారు. అది వారిద్దరి మధ్య చావో రేవో తేలేవరకూ జరిగిన యుద్ధం. ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతున్నది కేవలం ఇద్దరు పురుషుల మధ్య మాత్రమే కాదు. మొత్తం బ్రాహ్మణ తాత్వికత, సంస్కృతికి.. కుహనా 'అబ్రాహ్మణ' కూటమికి మధ్య యుద్ధం. బ్రాహ్మణ సంస్కతికి కాంగ్రెస్ రాజకీయ పోరాటాలు కొంతమేరకు సాయంగా ఉంటే.. దాని వైరివర్గానికి (జస్టిస్ పార్టీ) ప్రభుత్వ అధికారం, ప్రభావం అండగా ఉన్నాయి. బ్రాహ్మణుడైన గోపాలకృష్ణయ్య రామదండు ద్వారా దైవ సాయం కోరితే.. అబ్రాహ్మణుడైన పానుగంటి రాజా బాయినెట్‌ను, కిరాతక బలాన్ని తనకు సాయంగా తెచ్చుకున్నారు'' అని గుమ్మడీదల వ్యాఖ్యానించారు.

''పానుగంటి రాజా చీరాల వచ్చినపుడు ఆయనను కలవటానికి, ఆయన సలహా వినటానికి ఒక్క పురుగు కూడా రాలేదు. కానీ 16,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు గోపాలకృష్ణయ్య ఇంటి ముందు గుమిగూడారు. ఆయన పిలుపుతో తమ ఇళ్లూ వాకిళ్లు వదిలేసి మరీ ఆయన వెనుక నడిచారు. గోపాలకృష్ణయ్య తాత్కాలికంగా గెలిచారు. కానీ చివరికి గాలి ఆయనకు ఎదురు తిరిగింది. పానగల్ రాజా తుది విజయం సాధించారు. ఇప్పుడు చీరాలలో మునిసిపాలిటీ ఇంకా పాలిస్తోంది'' అని 1928లో ప్రచురించిన తన పుస్తకంలో గుమ్మడీదల పేర్కొన్నారు.

భారత గ్రామానికి - పాశ్చాత్య పట్టణానికి మధ్య పోరాటం

అలాగే.. చీరాల - పేరాల ఉద్యమం భారతీయ గ్రామీణ సంస్కృతికి, పాశ్చాత్య పట్టణ నాగరికతకు మధ్య పోరాటంగా కూడా గుమ్మడీదల విశ్లేషించారు.

''భారతదేశం పాశ్చాత్య దేశాల లాగా కాకుండా ప్రధానంగా గ్రామీణ దేశం. మన జీవితం మొత్తం, పరిపాలన సహా ప్రాధమిక గ్రామ నిర్మాణం మీద ఆధారపడి ఉంది. భారతదేశం అనే ఉన్నతస్థాయి నిర్మాణంలో.. మన గ్రామం ఒక ఇటుక వంటిది. కీలకమైన భాగం. విభిన్న జాతులు, మతాలు, కులాలు, సమాజాలు, భాషల వ్యవస్థీకృత నిర్వహణ రహస్య గ్రామమే. ప్రాచీన కాలం నుంచి దాదాపు నేటి వరకూ మన జీవితం, పరిపాలన అత్యంత విజయవంతంగా సాగటానికి ఇదే కారణం.

మన ప్రధాన స్రవంతి జీవితం ఎల్లప్పుడూ గ్రామీణ తరహా జీవితంగానే ఉంది. అది కనీసం పాక్షికంగా కూడా పట్టణీకృతం కాలేదు. మనకు మన పట్టణాలు, నగరాలు ఉన్నా కూడా నిజానికవి రాచరిక, సైనిక వంటి ప్రత్యేక అవసరాల కోసం మాత్రమే. గ్రామం అనేది ఎల్లప్పుడూ మన జీవితానికి, పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంది. పాశ్చాత్య ప్రపంచపు ప్రాణవాయువు అయిన 'పట్టణీకరణ' మన ప్రజల మనుగడకే మరణ ఘంటికలాగా మారింది.

కానీ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోకి వచ్చినప్పటి నుంచీ వారి స్వదేశంలో పట్టణ పరిస్థితుల గురించి వారికి తెలిసిన దానివల్ల కావచ్చు, వారి సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం కావచ్చు.. మన గ్రామీణ వ్యవస్థలను ధ్వంసం చేయటానికి, వాటి స్థానంలో ఇంగ్లండ్‌లో ఉన్న తరహా మునిసిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయటానికి తన శాయశక్తులా పనిచేస్తోంది'' అని ఆయన తను పుస్తకంలో రాశారు.

''మునిసిపాలిటీ అనేది 'అబ్రాహ్మణులకు ఆంగ్లేయులకు పుట్టిన సంకరం' అని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రకటించారు. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన అబ్రాహ్మణులు, ఆంగ్లేయులు. ఈ దేశాన్ని దాని గొప్ప మార్గమైన స్వధర్మం, స్వరాజ్య మార్గంలో పునఃప్రారంభించే ప్రయత్నంలో భాగంగా.. మన కీలకమైన గ్రామీణ జీవితం మీద బ్రిటిష్ రాజకీయ సంస్కృతి ప్రభావాన్ని ప్రతిఘటించటానికి, ఓ కొత్త గ్రామీణ సంప్రదాయాలను స్థాపించటానికి చీరాల దగ్గర రామనగర్‌ను ఏర్పాటు చేయటం ద్వారా ఆయన తనదైన శైలిలో ప్రయత్నించారు'' అని గుమ్మడీదల పేర్కొన్నారు.

చీరాల - పేరాల ఉద్యమం చల్లారిన తర్వాత.. ఒకటిన్నర దశాబ్దం పాటు ఆ మునిసిపాలిటీ కొనసాగింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1938లో చీరాల - పేరాల మునిసిపాలిటీని రద్దు చేసినట్లు గుమ్మడీదల తన పుస్తకంలో రాశారు.

మరోవైపు.. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1922 అక్టోబర్ 2వ తేదీన తిరుచినాపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత గుంటూరు సమావేశంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు 'ఆంధ్రరత్న' బిరుదు ఇచ్చి సత్కరించారు. కాంగ్రెస్‌లోనూ, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నేతలు సి.ఆర్.దాస్, మోతీలాల్ నెహ్రూలు ఏర్పాటు చేసిన స్వరాజ్య పార్టీలోనూ కీలక పదవుల్లో పనిచేశారు.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కొంత కాలానికి రామనగరు తిరిగి వచ్చారు. చీరాల వద్ద విద్యా పీఠాన్ని స్థాపించటానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనకు క్షయ వ్యాధి సోకటంతో 39 ఏళ్ల వయసులో 1928 జూన్ 10వ తేదీన కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Cheerala – Parala: Why this 100-year-old movement collapsed in 11 months? Is this a part of the 'Brahmin - Non-Brahmin struggle'?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X