ఛావా ఎఫెక్ట్.. ఔరంగజేబు సమాధి ఉంటుందా..పోతుందా?
Grave of Mughal Emperor Aurangzeb: ఇటీవల విడుదలైన ఛావా చిత్రం తర్వాత మొఘల్ పాలకుడు ఔరంగజేబు గురించి దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఆ సినిమాలో ఔరంగజేబును చాలా క్రూరమైన పాలకుడిగా చూపించారు. కానీ ఔరంగజేబు గొప్పపాలకుడు అని మహారాష్ట్ర ఎస్పీ నాయకుడు అబూ అజ్మీ చేసిన ప్రకటన పెనుదూమారం రేపింది. ఆయన చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది. అబూ అజ్మీ తన ప్రకటనను ఉపసంహరించుకున్నప్పటికీ ఇప్పుడు ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. రాష్ట్రంలోని అనేక రాజకీయ, మతపరమైన సంస్థలు ఈ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఔరంగజేబు మరణించిన సమయంలో మహారాష్ట్రలోనే ఉన్నాడు. మొఘల్ చక్రవర్తిని ఔరంగాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్దాబాద్ లో ఖననం చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఇక్కడ ఉంది.
ఈ వివాదం నేపథ్యంలో ఒక ఆర్టీఐ నివేదిక అగ్నికి ఆజ్యం పోసింది. హిందూ జనజాగృతి సమితి ఆర్టీఐ ద్వారా పొందిన సమాచారం ప్రకారం.. 2011 నుంచి 2023 వరకు ఔరంగజేబు సమాధి నిర్వహణ కోసం కేంద్ర పురావస్తు శాఖ సుమారు రూ.6.5 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించింది. సింధుదుర్గ్ కోటలో ఉన్న రాజరాజేశ్వర ఆలయ నిర్వహణకు ఏటా రూ.6,000 మాత్రమే ఇస్తుండగా.. సమాధి నిర్వహణకు ఇంత పెద్ద మొత్తాన్ని ఎందుకు ఖర్చు చేశారని కమిటీ ప్రశ్నను లేవనెత్తింది. ఇతర మతపరమైన ప్రదేశాల నిర్వహణకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని హిందూ జనజాగృతి సమితి ఆరోపించింది.

సీఎం ఫడ్నవీస్ ఏం చెప్పారంటే?
రాజరాజేశ్వర ఆలయ నిర్వహణకు ఖర్చు చేసే మొత్తానికి సంబంధించి హిందూ జనజాగృతి సమితి దీనిని వివక్షతగా అభివర్ణించింది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. దీని తర్వాత ఔరంగజేబు సమాధిని అక్కడి నుంచి తొలగించాలనే డిమాండ్ ఉంది. ఈ విషయం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఔరంగజేబు సమాధికి భారత పురావస్తు సర్వే శాఖ రక్షణ కల్పించిందని అన్నారు. ఈ పని చట్టపరమైన ప్రక్రియ కింద జరిగిందని చెప్పారు. కాబట్టి దీనిని తొలగించడానికి లేదా ఏవైనా మార్పులు చేయడానికి చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోలేమని ఆయన చెప్పారు.
అది ఇప్పుడు జాతీయ వారసత్వ సంపద
ఇదిలా ఉండగా.. దేశంలో ఒక వర్గం ఔరంగజేబు సమాధి తొలగింపును వ్యతిరేకిస్తోంది. అయితే ఈ సమాధిని తొలగించడం అంత సులభం కాదు. మొఘల్ చక్రవర్తి సమాధి కావడంతో అది ఇప్పుడు జాతీయ వారసత్వ సంపదగా మారింది. అటువంటి పరిస్థితిలో చారిత్రక వారసత్వానికి దేశంలో ఉన్న చట్టం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. ప్రభుత్వం కోరుకుంటే దాన్ని తొలగించగలదా లేదా కూల్చివేయగలదా? అనే అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. దేశం స్వాతంత్ర్యం సాధించిన సమయంలో 2826 చారిత్రక ప్రదేశాలను పరిరక్షణ వర్గంలోకి చేర్చారు. 2014లో ఆ సంఖ్య 3650కి పెరిగింది. దేశంలో ఈ చారిత్రక వారసత్వాలను సంరక్షించే పనిని భారత పురావస్తు సర్వే సంస్థ చేస్తోంది.
రక్షిస్తున్న భారత పురావస్తు సర్వే సంస్థ
రాజ్యాంగంలోని ఆర్టికల్ 42, 51ఏ(ఎఫ్)లు దేశ వారసత్వాన్ని కాపాడుకోవడం జాతీయ బాధ్యత అని పేర్కొన్నాయి. అన్ని వారసత్వ ప్రదేశాలను సంరక్షించే బాధ్యత భారత పురావస్తు సర్వే సంస్థకు ఉంది. 1958 నాటి పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టంలో సెక్షన్ 4(1) ప్రకారం.. ఏదైనా చారిత్రక భవనం లేదా వారసత్వ ప్రదేశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగ ప్రకారం, పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం.. జాతీయ చారిత్రక వారసత్వం, భవనాలు, పత్రాలను సంరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వారసత్వ సంపదకు హాని కలిగించే లేదా విధ్వంసం చేసే ప్రయత్నం జరిగితే రక్షణ కల్పించాలి. ఎవరైనా తొలగించడానికి లేదా ఏవైనా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తే రక్షణ కల్పించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద చారిత్రక వారసత్వ రక్షణ, నియంత్రణ ప్రభుత్వ బాధ్యత.












Click it and Unblock the Notifications