మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ..!!
Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి రక్తమోడాయి. కాల్పుల మోతలతో దండకారణ్యం మార్మోగింది. తాజాగా చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. కోలుకోలేని దెబ్బ కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో సంభవించిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిదిమంది మావోయిస్టులు మరణించారు. సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు లభించాయి. దాదాపుగా అవన్నీ కూడా ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దంతెవాడ- బిజాపూర్ జిల్లాల్లో విస్తరించిన దండకారణ్యంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడ, బిజాపూర్, బస్తర్ పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు పక్కా సమాచారం అందిన నేపథ్యంలో యాంటీ- మావోయిస్ట్ స్క్వాడ్ బలగాలు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ నిర్వహించారు.
దంతెవాడ-బిజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఉదయం కూంబింగ్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. పరస్పరం ఎదురుకాల్పలకు దిగారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు.
తొలుత వారిని లొంగిపోవాలంటూ హెచ్చరించామని, దీన్ని పట్టంచుకోకుండా మావోయిస్టులు కాల్పులకు దిగారని దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. దీనితో బలగాలు ఎదురుకాల్పులకు దిగాయని వివరించారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిదిమంది మావోయిస్టులు మరణించారని అన్నారు.
మరికొందరు తప్పించుకున్నట్లు సమాచారం ఉందని, వారికోసం పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని ఎస్పీ గౌరవ్ రాయ్ చెప్పారు. సంఘటన స్థలం నుంచి సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లు, పాయింట్ 303 రైఫిళ్లు, పాయింట్ 315 బోర్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో అయిదు రోజుల వ్యవధిలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం ఇది రెండోసారి. కిందటి నెల 29వ తేదీన జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. నారాయణ్‌పూర్ సమీపంలోని అబూజ్‌మఢ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిచెందిన మావోయిస్టులను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications