ఛత్తీస్ ఘడ్ లో మళ్లీ కాంగ్రెస్ ఆ గేమ్ ఛేంజర్ హామీ-ఫలిస్తే ఇదో చరిత్ర..!
వచ్చే నెలలో ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్ ఘడ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సర్వే నివేదికలు అనుకూలంగా వస్తున్న వేళ ఈసారి అవకాశాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ వదులుకోరాదని భావిస్తున్న కాంగ్రెస్..తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో గత ఎన్నికల నాటి ఓ హామీని రిపీట్ చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీని అమలు చేసి చూపించిన కాంగ్రెస్.. మళ్లీ గెలిపిస్తే మరోసారి దాన్ని అమలు చేస్తామని చెబుతోంది. ఇలా ఓసారి ఇచ్చిన హామీ అమలు చేయడం, మళ్లీ దాన్ని రిపీట్ చేస్తామని హామీ ఇవ్వడం సంచలనంగా మారింది.
ఛత్తీస్‌గఢ్ లో మళ్లీ అధికారంలోకి వస్తే మరోసారి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ రాష్ట్రంలోని రైతులకు హామీ ఇచ్చారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అదే వాగ్దానం చేసి గెలిచిన వెంటనే దాదాపు రూ.9,000 కోట్ల రుణాలు, మరో రూ.350 కోట్ల నీటిపారుదల పన్నును మాఫీ చేసింది. మన రైతులకు అండగా నిలవడం ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసిందని గతంలో ఇచ్చిన రుణమాఫీ నిలబెట్టుకోవడాన్ని సీఎం బఘేల్ గుర్తుచేశారు.

గతంలో ఇచ్చిన రుణమాఫీ హామీ అమలుతో ఐదేళ్లలో వాణిజ్యం, వ్యాపారంలో పెరుగుదల కనిపించిందన్నారు. ధరల పెరుగుదల, దీని ప్రభావం ఇతర రాష్ట్రాల్లో బలంగా ఉందని, కానీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం పరిస్దితి వేరుగా ఉందన్నారు. రైతుల జేబుల్లోకి వెళ్లిన డబ్బులు మళ్లీ మార్కెట్‌కు వచ్చాయన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు డబ్బులు ఇస్తే అలా జరగదన్నారు. 14.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పారిశ్రామికవేత్తలకు కేంద్రం మొండి బకాయిలను మాఫీ చేసిందని, అయితే అది మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపిందని ఆయన ప్రశ్నించారు. కానీ తాము రైతుల రుణాలను మాఫీ చేసినప్పుడు, అది రైతులు, వ్యాపారుల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చిందన్నారు.
రుణమాఫీతో పాటు ఈసారి బఘేల్ నాలుగు వాగ్దానాలు చేశారు. ఇందులో బీసీల కోసం చేసిన కుల జనాభా గణన వాగ్దానం 51 సీట్లలో కీలకమైన అంశంగా మారబోతోందని తెలుస్తోంది. 17.5 లక్షల పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టించి ఇవ్వాలనేది మరో వాగ్దానం. అలాగే ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేస్తామని కూడా ప్రకటించారు. అలాగే విద్యార్ధుల కోసం ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications