టీ బిల్లు: కావూరి అభ్యంతరం, నిలదీసిన చిదంబరం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు విషయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడకుండా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లుపై శుక్రవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశంలో ఆ సంఘటన చోటు చేసుకున్నట్లు శనివారంనాడు మీడియాలో వార్తలు వచ్చాయి. మంత్రివర్గ సమావేశంలో వాడిగా వేడిగా జరిగిన చర్చలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కోరారు. అయితే అందుకు మంత్రివర్గం అంగీకరించలేదు. అసలు ఈ డిమాండే అర్థరహితమని తెలంగాణామంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు.
దాదాపు రెండు గంటలపాటు కేంద్ర మంత్రి వర్గం తెలంగాణ అంశంపై చర్చలు జరిపింది. కేంద్ర మంత్రులు కావూరి మధ్యలో రాష్ట్ర విభజనపై తమ ఆక్షేపణను కాస్త గట్టిగానే వినిపించడానికి ప్రయత్నించినట్లు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ఆయన నోరు మూయించినట్లు వార్తలు వచ్చాయి. మీరు ఇలాగే ముందుకు వెళ్తే ఈ దేశం విచ్ఛిన్నం అవుతుందని కావూరి హెచ్చరించగా, చిదంబరం జోక్యం చేసుకుంటూ ఇలా కాకుండా మరో రకంగా ఎలా పరిష్కరించాలో మీరే చెప్పండి అనడంతో కావూరి మారు మాట్లాడలేకపోయినట్టు తెలుస్తోంది.

తెలంగాణ సమస్య ఈనాటిది కాదు, 2009 నుంచి ఐదేళ్లపాటు తెలంగాణా అంశంపై ఏకాభిప్రాయంకోసం యత్నిస్తున్నామని, సీమాంధ్రులు అవునంటే తెలంగాణావాదులు కాదంటారని లేదంటే తెలంగాణావాదులు అవునంటే సీమాంధ్రులు కాదంటారని, కాబట్టి ఇంతకుమించి ఎవరూ గొప్పగా పరిష్కరించలేరని చిదంబరం గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది.
మరి శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు పట్టించుకోలేదనే కావూరి ప్రశ్నకు ఈ బిల్లు రూపకల్పనకు దాన్నే ప్రాతిపదికగా చేసుకున్నామని చిదంబరం వివరించారు. ఈ వాగ్వివాదం జరుగుతున్నప్పుడుప్రధాని డాక్టర్ మన్‌మోహన్ సింగ్ ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications