ఆగస్ట్ నెలలో భారత భూభాగంలోకి మూడుసార్లు చైనా బలగాలు
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా చైనా బలగాలు గత ఆగస్ట్ నెలలో భారత భూభాగంలోకి మూడుసార్లు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి దాదాపు నాలుగు కిలోమీటర్ల లోపలకు వచ్చాయట. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఆగస్ట్ 6వ తేదీన, ఆగస్ట్ 14వ తేదీన, ఆగస్ట్ 15వ తేదీన మన భూభాగంలోకి ప్రవేశించాయి. చమోలీ జిల్లాలోని బారాహోటి ప్రాంతంలో గల వాస్తవాధీన రేఖను దాటి నాలుగు కిలో మీటర్లు లోనికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

చైనా బలగాలు భారత్‌లోకి ప్రవేశించడం కొత్త కాదని, గత ఏడాది జూలై 25వ తేదీన కూడా బారాహోటి ప్రాంతంలో కిలో మీటర్ లోపలకు చొచ్చుకొని వచ్చాయని వార్తలు వచ్చాయి. గతంలోను ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
భారత్ - చైనా మధ్య 4057 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ ఉంది. ఈ సరిహద్దుపై ఇరు దేశాల మధ్య పలుమార్లు వివాదాలు నెలకొన్నాయి. గతంలో డొక్లాం వివాదం నేపథ్యంలోను భారత్, చైనా మధ్య దాదాపు రెండున్నర నెలల పాటు ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications