చైనా చేతిలో దేశ రక్షణ వ్యవస్థ - గుట్టు మట్లపై పరిశోధన: భారత సముద్ర జలాల్లో స్పై షిప్ తిష్ఠ..!!
న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్ సరిహద్దుల్లో చొరబడింది. ఇదివరకు లఢక్ తూర్పు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణకు పాల్పడిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఇప్పుడు కూడా అలాంటి దుందుడుకు చర్యలకు తెగబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టర్ సరిహద్దుల్లో భారత జవాన్లపై దాడికి పాల్పడిన సంఘటన సృష్టించిన ప్రకంపనలు తగ్గకముందే మళ్లీ పంజా విసిరింది.

తవాంగ్ సెక్టార్‌లో..
ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద ఇలాంటి ఘర్షణే భారత్-చైనా జవాన్ల మధ్య చోటు చేసుకుంది. ఈ నెల 9వ తేదీన తవాంగ్ సెక్టర్ సమీపంలో గల వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల జవాన్లు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో రెండు దేశాల జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన చైనా పీఎల్ఏ బలగాలను భారత్ సరిహద్దు జవాన్లు నిలువరించే ప్రయత్నంలో ఈ ఘర్షణన చోటు చేసుకుందని వివరించారు.

చైనా దాడిలో..
తాజాగా చోటు చేసుకున్న ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా భారత జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఆరుమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆ ఆరుమందిని అత్యవసర చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా గువాహటికి తరలించాల్సి వచ్చింది. తవాంగ్ సెక్టార్ సమీపంలోని వాస్తవాధీన రేఖ పొడవునా సుమారు 300 మంది చైనా సైనికులు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించగా భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పి కొట్టారు.

భారత సముద్ర జలాల్లోకి..
ఇప్పుడు తాజాగా చైనా- మరోసారి అలాంటి తెంపరితనాన్ని ప్రదర్శించింది. భారత జలాల్లోకి దూసుకొచ్చింది. హిందూ మహాసముద్రంలో భారత జలాల్లోకి ప్రవేశించింది చైనాకు చెందిన పరిశోధక నౌక యాంగ్ వాంగ్-5. ఇప్పుడా షిప్- భారత జలాల్లో లేదని, వెనక్కి వెళ్లిపోయినట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. ఈ నౌక కార్యకలాపాలను లాంగ్ రేంజ్ విజిలెన్స్ డ్రోన్లు, సముద్ర గస్తీ విమానాలు, భారత నౌకా దళ విభాగాలన్నీ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నాయి.

గూఢచర్య నౌకగా..
కొద్ది రోజుల క్రితం హిందూ మహాసముద్ర రీజియన్‌లోకి చైనా గూఢచర్య నౌక యాంగ్ వాంగ్-5 ప్రవేశించిందని నావికాదళం పేర్కొంది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహ ట్రాకింగ్ పరికరాలు ఉన్నాయని తాము భావిస్తున్నట్లు చెప్పాయి. ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌టోట పోర్ట్ వద్ద ఈ నౌకను నిలపడానికి శ్రీలంక అనుమతి ఇవ్వడాన్ని భారత్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం భారత్-శ్రీలంక మధ్య దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది.












Click it and Unblock the Notifications