• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రజనీకాంత్ కోసం బిజెపి యత్నం: చో రాయబారం?

|

Cho mediating with Rajinikanth fotr BJP
చెన్నై: దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ తన ప్రయత్నాలు ఎప్పటి నుంచో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ పార్టీ తమిళ సూపర్ స్టార్, దక్షిణాది ప్రముఖ నటుడు రజనీకాంత్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఫలితాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నిర్వహించే ప్రచార సభల్లో ఆయన పక్కన సూపర్ స్టార్ రజనీని కూర్చోబెట్టేందుకు బిజెపి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకోసం రజనీకి సన్నిహితంగా ఉండే బిజెపి వాది, తుగ్లక్ పత్రిక సంపాదకుడు చోరామస్వామిని రంగంలోకి దించింది. తమ అభిమాన నటుడి రాజకీయ ప్రవేశం కోసం ఆయన అభిమానులైన తమిళనాడు రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గతంలో రజనీ అభిమాలే రజనీకాంత్ పేరిట పార్టీని పెట్టి, జెండాను కూడా ప్రకటించారు. దీంతో అభిమానుల చర్యకు ఆశ్చర్యపోయిన రజనీ, తాను దేవుడు ఆదిశిస్తేనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి ఆ చర్యకు ముగింపు పలికారు. అప్పటి నుంచి రజనీ రాజకీయ ప్రవేశంపై ఎప్పుడూ చర్చలు జరగలేదు. కాగా ప్రస్తుతం రజనీని తమ పార్టీ తరపున దక్షిణాదిన నిర్వహించే ప్రచార సభలకు హాజరయ్యేలా బిజెపి తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందన్న వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో దక్షిణాదిన కూడా తమ స్థానాలను పెంచుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇది ఇలా ఉండగా గతం నుంచి కూడా రజనీకాంత్ బిజెపి పట్ల సానుకూల వైఖరితో ఉన్నారని రాష్ట్ర పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిజెపికి సానుకూలంగా కూడా మాట్లాడారని వారంటున్నారు.

కాగా గతంలో ఎన్నికలు జరిగిన సమయాల్లో రజనీకాంత్ తన అభిమానులకు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె, దివంగత నేత మూపనార్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌కు మద్దతుగా, 1998 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, డిఎంకె కూటమికి, 2004 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అన్నాడిఎంకె కూటమికి మద్దతుగా రజనీ పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

1996, 1998 ఎన్నికల్లో తన పరోక్ష సంకేతాలు పని చేసినా, 2004లో అందుకు విరుద్ధంగా ఫలితాలు రావడంతో రజనీ 2009 ఎన్నికల్లో సంకేతాలు ఇవ్వడం మానేసినట్లు తెలిసింది. అయితే 2011 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన మద్దతును అన్నాడిఎంకెకు తెలపారు. ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బిజెపి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రజనీ మద్దతును తమ పార్టీకి అందించేలా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

రజనీకాంత్‌తో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సంప్రదింపులు జరిపేలా రాష్ట్ర పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా గతంలో రజనీ అనారోగ్యంతో ఉన్న సమయంలో మోడీ అతన్ని పరామర్శించడం, గుజరాత్‌లో జరుగుతున్న అభివృద్ధిని రజనీ మెచ్చుకోవడం గమనార్హం. అంతేగాక గుజరాత్‌లో నదుల అనుసంధానికి రజనీ కోటి రూపాయల విరాళం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మోడీని ప్రధాని చేసేందుకు రజనీ తనవంతుగా బిజెపికి సహకరిస్తారని రాష్ట్ర పార్టీ వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితుడు, రజనీకాంత్‌కు మంచి మిత్రుడిగా ఉన్న తుగ్లక్ పత్రిక సంపాదకుడు, బిజెపి వాది చోరామస్వామిని బిజెపి వర్గాలు రంగంలోకి దించాయి. ఇప్పటికే మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి గట్టిగా బలపరుస్తున్న చోరామస్వామి.. రజనీకాంత్‌ను బిజెపికి మద్దతుగా వ్యవహరించేలా చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీ ఫిబ్రవరి 8న చెన్నైలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ సందర్భంలోనే రజనీతో మోడీ భేటీ అయ్యేలా రాష్ట్ర పార్టీ వర్గాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

English summary
According to media reports - BJP is trying tp woo Tamil super star Rajinikanth. Cho Ramaswami is mediating.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X