మెట్రో ఆత్మహత్యలు: 180 మంది ప్రాణాలను కాపాడిన సిఐఎస్ఎఫ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని వివిధ మెట్రో స్టేషన్ల వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన సుమారు 180 మంది ప్రాణాలను కాపాడారు సిఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్) సిబ్బంది. అంతేగాక, రకరకాల సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి.. తిరిగి వారికి జీవితంమీద ఆశలు కలిగించారు.
గడిచిన ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైల్వే ట్రాక్‌లపై ఆత్మహత్యలకు ప్రయత్నించిన 180 మందిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ఎయిర్ పోర్టుల తర్వాత బంగారం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది మెట్రో రైళ్లలోనే కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో రైల్ స్టేషన్ల వద్ద రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సిఐఎస్ ఎఫ్ బలగాలను మోహరించారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైళ్లలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నేరాల్ని అడ్డుకున్నారు. దాదాపు 10 వేల మంది పురుషుల్ని మహిళల కోచ్‌ల నుంచి దింపేశారు. అంతేగాక, 6 ఆయుధాలు, 120 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.10.2 కోట్ల విలువైన బంగారంతోపాటు రూ. 10.8 కోట్ల అక్రమ ధనాన్ని గుర్తించారు. 382 మంది జేబు దొంగల్ని అరెస్టు చేశారు. అందులో చోరీకి పాల్పడినవారిలో 90 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం.
కాగా, ఇవన్నింటికన్నా 180 మంది ప్రాణాలను కాపాడిన విషయంలోనే సిఐఎస్ఎఫ్ సిబ్బందికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సిఐఎస్ఎఫ్ సిబ్బంది మెట్రో స్టేషన్ల వద్ద విధులు నిర్వహించడం వల్ల అక్కడ జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య 90శాతానికి పైగా తగ్గిపోయిందని సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అరవింద్ రంజన్ తెలిపారు.












Click it and Unblock the Notifications