వారికి వైఎస్ జగన్ ఏడు లక్షల రూపాయల సాయం, కూటమి సర్కార్ కు డిమాండ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇటీవల విశాఖ తీరంలో బోటు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు పరిహారం ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే వెల్లడిస్తే, మత్యకారుల కుటుంబాల కోసం మేము సైతం అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్ధిక సాయం
విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇటీవల జరిగిన బోటు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నేడు బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్, ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఏడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు.

మత్స్యకార కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామన్న జగన్
ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్నా ను జగన్ పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వివరాలను తెలుసుకున్నారు. చిన్నా కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆదుకుంటామని జగన్ ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని వైయస్ జగన్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్
ఇక ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించకపోవడాన్ని తప్పు పట్టారు. బోటు ప్రమాదం జరిగిన తర్వాత ఒక్క అధికారి కూడా బాధితుల వద్దకు రాకపోవడం బాధ్యతారాహిత్యంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర మంత్రులు ఎవరు స్పందించలేదని, మత్స్య శాఖ మంత్రి కూడా బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు.
బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్
రాత్రికి రాత్రి స్పందించి ఉంటే ఎంతోమంది మత్స్యకారుల ప్రాణాలు కాపాడవచ్చు కదా అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా సాయం అరకొరగా ఉందని, బాధిత కుటుంబాలకు కనీసం కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, వారికోసం ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. మత్స్యకార బాధిత కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా బలోపేతం అయ్యేవిధంగా అండగా నిలుస్తామన్నారు.












Click it and Unblock the Notifications