చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ- టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలపై సీబీఐ ..!
ఏపీలో గన్నవరం ఎయిర్ పోర్టు అదనపు టెర్మినల్ నిర్మాణ టెండర్ వ్యవహారం ఇప్పుడు టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య కాకపుట్టిస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నా గన్నవరం ఎయిర్ పోర్టు టెర్మినల్ కాంట్రాక్టును వైసీపీ నేత వల్లభనేని వంశీ అనుచరుడికి ఇవ్వడం ఏంటని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు వేసిన ప్రశ్న చంద్రబాబును ఇరుకునపెట్టింది. అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) సైతం ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని ఇవాళ సీఎంకు లేఖ రాశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై ఎయిర్ పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్లింగ్ కాంట్రాక్టు విషయంలో వస్తున్న ఆరోపణలను ఇవాళ ఖండించారు. ఈ మేరకు ఆయన స్ధానిక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిన్న చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. ఇందులో వంశీ.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్లింగ్ కాంట్రాక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పేరును రాజకీయంగా దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు విలువ రూ.300 కోట్లని ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవంగా అందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు.

తనపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. విచారణలో తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. వాస్తవాలు బయటకు వస్తే తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని తేలుతుందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్లింగ్ కాంట్రాక్టు విషయంలో తన పేరు వినిపిస్తోందని పత్రికల్లో వచ్చిన యార్లగడ్డ ఆరోపణల క్లిప్పింగ్స్ ను కూడా చంద్రబాబుకు పంపారు. రూ.300 కోట్ల కాంట్రాక్టులో సుమారు 80 శాతం పనులు చేశారని, మిగిలిన 20 శాతం పనులకు రూ.206 కోట్ల చెల్లింపులు జరిగాయనే ఆరోపణలు వచ్చినట్లు వార్తల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం విచారణ చేపట్టే అవకాశముందని పేర్కొన్నారు. వంశీ మాత్రం అన్ని ఆరోపణలను ఖండిస్తూ, తనకు కాంట్రాక్టుతో ఎలాంటి సంబంధం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసినట్లు ఉన్న వార్తల క్లిప్పింగ్స్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications