కేంద్రం తీరుపై సీజేఐ హాట్ కామెంట్స్ ! జడ్డీలు లేని ట్రైబ్యునళ్లు అవసరమా ?
దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులు, ఇతర కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం చేసిన ప్రతిపాదనల్ని కేంద్రం తొక్కిపెట్టడంపై ఇప్పటికే న్యాయవ్యవస్ధలో అసంతృప్తి కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ పై విచారణ కూడా జరుగుతోంది. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. అదే సమయంలో సీజేఐ డీవై చంద్రచూడ్ కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ముంబై బెంచ్ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులలో విచారణ జాప్యాలను అరికట్టడంలో, బాధితులకు న్యాయం అందించే విషయంలో ట్రిబ్యునల్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అయితే జడ్డీల నియామకాలు జరగకపోవడం వివాదంగా మారుతోందన్నారు. చివరకు జడ్డీలు లేకుండా ఇన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడం అవసరమా అనే ఆలోచనకు దారితీసిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

తమ ట్రిబ్యునల్‌లు చాలా సమస్యలతో సతమతమవుతున్నాయని, తగినంత మంది న్యాయమూర్తులు లేనప్పుడు ఇన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడం నిజంగా అవసరమా అని తాము ప్రశ్నించుకుంటున్నట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న న్యాయమూర్తులు అందుబాటులోకి వస్తే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయన్నారు. అయితే న్యాయమూర్తుల నియామకంపై అంతిమ నియంత్రణ ఎవరిది అనే అంశంపై నిరంతరం తగాదా నడుస్తోందని కేంద్రాన్ని ఉద్దేశించి సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న పోలరైజేషన్ పైనా సీజేఐ స్పందించారు. సోషల్ మీడియా పెరుగుదల, సమాజంలో అసహనం వల్లే ఇలా పోలరైజేషన్ అనేది పెరుగుతోందని సీజేఐ డివై శుక్రవారం అన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతోందని, దీనికి భారత దేశం మినహాయింపు ఏమీ కాదన్నారు.












Click it and Unblock the Notifications