నా అధికారాల జోలికి రావొద్దు
దేశ అత్యున్నత న్యాయస్థానం లో మంగళవారం అసాధారణ సంఘటన జరిగింది. ముందస్తు విచారణకు పట్టుబట్టిన ఓ న్యాయవాది పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. ''నా అధికారాల జోలికి రావొద్దు'' అంటూ మండిపడ్డారు.
ఏప్రిల్ 17న సీజేఐ ధర్మాసనం విచారించనున్న పిటిషన్‌పై ముందస్తు విచారణ జరిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్‌ను మరో ధర్మాసనం ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరారు. దీంతో సీజేఐ అసహనానికి లోనయ్యారు. ''మీ కేసు విచారణ 17వ తేదీన లిస్ట్ అయి ఉంది.. ఇప్పుడు 14వ తేదీ కోసం మరో ధర్మాసనం ముందుకు వెళ్తానని చెబుతున్నారు.. నా దగ్గర ఇలాంటి ట్రిక్స్ పనిచేయవు.. మీ కేసు విచారణ 17వ తేదీనే జరుగుతుంది.. ఆరోజే చేపడతాం. అంతే..!'' అని చంద్రచూడ్ స్పష్టం చేశారు.

దీంతో ఆ న్యాయవాది సీజేఐకి క్షమాపణలు తెలిపారు. దీనికి జస్టిస్ చంద్రచూడ్ బదులిచ్చారు. ''మీ క్షమాపణలను అంగీకరిస్తున్నానని, అయితే తన అధికారాలను సవాల్ చేసేందుకు ప్రయత్నించొద్దని, నా అధికారాల జోలికి రావొద్దు'' అని గట్టిగా చెప్పారు. చీఫ్ జస్టిస్ గతంలోనూ ఓ సీనియర్ న్యాయవాది తీరుపై ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో ఓ కేసు విచారణను ఒక తేదీన చేపట్టాలని ఆ సీనియర్ న్యాయవాది పట్టుబట్టగా ఆయనపై కూడా సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బెదిరించాలని చూడొద్దని, తాను బెదిరింపులకు లొంగనన్నారు.












Click it and Unblock the Notifications