షూ విసిరిన ఘటనపై నోరువిప్పిన సీజేఐ..! కీలక వ్యాఖ్యలు..!
మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో విష్ణుమూర్తి విగ్రహంపై కేసు విచారణ సందర్భంగా తాను అనని మాటల్ని సాకుగా చూపుతూ తనపై షూ విసిరిన లాయర్ వ్యవహారంపై సీజేఐ బీఆర్ గవాయ్ ఇవాళ తొలిసారి నోరువిప్పారు. తాజాగా సుప్రీంకోర్టులో తనపై లాయర్ రాకేష్ కిషోర్ దాడి చేయగానే స్పందించిన ఆయన.. దీన్నో చిన్న విషయంగా తీసుకుని వాదనలు కొనసాగించాలని అక్కడే ఇతర లాయర్లకు సూచించారు. ఆ తర్వాత బార్ కౌన్సిల్ సదరు లాయర్ ను సస్పెండ్ చేసింది.
ఇవాళ ఆ ఘటనపై తొలిసారి బహిరంగంగా మాట్లాడిన ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. అదో మర్చిపోవాల్సిన అధ్యాయమని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో మరో జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా స్పందించారు. ఈ ఘటనపై తనకు స్వంత అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఆయన ఓ సీజే అని, ఇది జోక్ కాదన్నారు. ఈ ఘటన జరగగానే సీజేఐ స్పందిస్తూ.. ఇవన్నీ చూసి డిస్టర్బ్ కావొద్దని, తామూ డిస్టర్బ్ కాబోమని లాయర్లకు తెలిపారు.

ఈ ఘటన తర్వాత ఢిల్లీ పోలీసులు సీజేఐపై షూ విసిరిన లాయర్ రాకేష్ కిషోర్ ను అదుపులోకి తీసుకున్నారు. మూడు గంటల పాటు ఆయన్ను విచారించారు. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆయనపై కేసు నమోదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు లాయర్ ను వదిలిపెట్టారు. ఆ తర్వాత బయటికి వచ్చిన అతను.. తనతో దేవుడే ఈ దాడి చేయించాడన్నారు. సనాతన ధర్మ వ్యతిరేకులపై దేవుడి ఆదేశాల మేరకే తాను దాడి చేసినట్లు చెప్పుకొచ్చాడు.

మరోవైపు సీజేఐ గవాయ్ పై జరిగిన దాడిపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు స్పందించాయి. ప్రధాని మోడీ సహా కీలక నేతలంతా ఈ దాడిని ఖండించారు. ప్రధాని మోడీ ఆ తర్వాత సీజేఐతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనకు సంఘీభావం తెలిపారు. అయితే సీజే మాత్రం ఈ విషయాన్ని పెద్దది చేయకూడదని భావిస్తుండటంతో సదరు లాయర్ విషయంలో ఏమీ చేయలేని పరిస్ధితి నెలకొంది.












Click it and Unblock the Notifications