తొలిరోజే కాక్రోచ్ లకు షాక్..! పోటీ నిరసనలు..! పోలీసులకు ఫిర్యాదులు..!
ఎస్ఐఆర్ లో అక్రమాలకు పాల్పడిన వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ఇవాళ ముంబై శివాజీ పార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టింది. పోలీసులు అనుమతి నిరాకరించినా భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు.. ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. తొలిరోజే బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై కాక్రోచ్ లకు సంఘీభావం తెలియజేస్తున్నారు. అయితే అదే సమయంలో కాక్రోచ్ పార్టీ నిరసనలకు పోటీగా రైట్ వింగ్ కు చెందిన ఓ గ్రూప్ పోటీ నిరసనలకు దిగింది.
శివాజీ పార్క్ సమీపంలో సీజేపీ నిరసన చేస్తున్న చోటుకు దగ్గర్లోనే జెన్ నెక్స్ట్ అని చెప్పుకుంటూ ఓ గ్రూపు నిరసనలకు దిగింది. కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని వీరు నిరసనకు దిగారు. దీంతో ఈ వ్యవహారం తొలిరోజే కాక్రోచ్ లకు షాకిచ్చింది. కాక్రోచ్ బాస్ అభిజీత్ దిప్కే ఫొటోలతో కూడిన ప్లకార్డులతో వీరు వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ అండతోనే వీరు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు శివాజీ పార్క్ వద్ద పోలీసుల అనుమతి లేకపోయినా కాక్రోచ్ జనతా పార్టీ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ధర్నా చేపట్టడంపై స్థానికులు కొందరు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీరు అంతటితో ఆగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.

ఈ మేరకు కాక్రోచ్ పార్టీ నేతలపై శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమతి లేకపోయినా, బాంబే హైకోర్టు 2013లో ఇచ్చిన తీర్పుకు విరుద్దంగా, మహారాష్ట్ర ప్రభుత్వ నిషేధ ఉత్తర్వుల్ని ఉల్లంఘించి శివాజీ పార్క్‌లో నిరసనను కొనసాగించడానికి, భారీ జనసమీకరణకు ప్రయత్నించారంటూ ఈ ఫిర్యాదు చేశారు. ఇది శాంతియుత నిరసన కాదని, రాజకీయ నిరసన ముసుగులో చట్టాన్ని ధిక్కరించే ప్రయత్నమని ఫిర్యాదుదారులు ఆరోపించారు. రాజ్యాంగం కోసం పోరాడుతున్నామని చెప్పుకునేవారే, అదే రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన హైకోర్టు అధికారాన్ని బహిరంగంగా సవాలు చేస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన బాధ్యతలన, న్యాయస్థాన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ, రాజ్యాంగపరమైన హక్కులను డిమాండ్ చేయడం కుదరదన్నారు. ఒకవేళ ఇలాంటి ప్రవర్తనను అనుమతిస్తే, రేపు ఎవరైనా సరే కోర్టు ఆమోదించిన ఆంక్షలను ఉల్లంఘించి, దానిని శాంతియుత కార్యకలాపం అని పిలుస్తూ, చట్టం చూసీచూడనట్లు వ్యవహరించాలని ఆశించవచ్చని తెలిపారు.













Click it and Unblock the Notifications
