CJP Protest: ఢిల్లీలో ఆంక్షలపై సుప్రీం ఫైర్..! భద్రత పేరుతో మూసేస్తారా ?
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో రేపు జరగనున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా 57 మెట్రో స్టేషన్లను మూసివేయడంపై సుప్రీంకోర్టు (supreme court)ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా కారణాలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవచ్చని, అయితే సాధారణ ప్రజలు ప్రజా రవాణాను వినియోగించుకునే హక్కును కూడా పరిరక్షించాలని ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
భద్రతా పరిమితులు విధించడం అంటే అన్ని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిరసన సందర్భంగా అదుపులేని జనసమూహం లేదా సంఘవిద్రోహ, దేశ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉంటుందనే ఆందోళన ఉంటే ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. సీజేపీ నిరసనకు ముందు ఢిల్లీలో పలు రహదారులను మూసివేయడంపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. బారికేడ్ల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ముందుగానే సమాచారం అందించాలని సూచించింది.

ఈ అంశంపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కోర్టు వ్యక్తం చేసిన ఆందోళనలను ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఏదో తప్పు జరుగుతోందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోందని కూడా ఆయన పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లలో ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అవసరమైతే ప్రభుత్వం ఇతర భద్రతా చర్యలను కూడా అమలు చేయవచ్చని సీజేఐ గుర్తుచేశారు. అయితే భద్రతా ఏర్పాట్ల పేరుతో సాధారణ పౌరులు మెట్రో, రైల్వే స్టేషన్లకు వెళ్లకుండా నిరోధించకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిరసనలను నియంత్రించేందుకు నిబంధనలు విధించవచ్చని, కానీ వాటి వల్ల అన్ని కార్యకలాపాలను నిలిపివేయలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుంటూనే ప్రజా రవాణా, రహదారుల వినియోగం, ప్రయాణికుల సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. మరోవైపు పోలీసుల అనుమతి లేకుండా చేసే నిరసనలు చట్ట విరుద్ధమైనవిగా పరిగణిస్తామని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు పోలీసుల అనుమతి అవసరం లేదని చెప్తున్నారు. దీంతో వారు పోలీసుల అనుమతి కూడా కోరలేదు.














Click it and Unblock the Notifications
