
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం... 8 ఏళ్ల బాలికపై 26 ఏళ్ల కజిన్ అత్యాచారం...
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో దారుణం జరిగింది. 8 ఏళ్ల ఓ బాలికపై 26 ఏళ్ల ఆమె కజిన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఆమెకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
దారుణం : టీనేజ్ యువతిపై 8 మంది గ్యాంగ్ రేప్-తల్లిదండ్రుల ముందే-ఆ ఘటనకు ప్రతీకారంగా
బాధితురాలు ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. నిందితుడు కూలీ పనికి వెళ్తుంటాడు. లైంగిక దాడి అనంతరం ఇంటికి చేరిన బాధిత బాలికకు తీవ్ర రక్తస్రావమైనట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మరోవైపు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించాడు. త్వరలోనే అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. అతనికి కఠిన శిక్ష విధించి తమకు న్యాయం చేయాలని బాధిత బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు,ఇతర నేరాలు బయటపడుతూనే ఉన్నాయి. గతేడాది ఇదే యూపీలో జరిగిన హత్రాస్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా పదుల సంఖ్యలో అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవలే యూపీలోని అమ్రోహ పట్టణంలో తల్లిదండ్రుల ముందే 16 ఏళ్ల ఓ టీనేజీ యువతిపై 8 మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరగడానికి ఒకటి,రెండు రోజుల ముందు.. బాధితురాలి సోదరుడు ఓ యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి కుటుంబం... వారిని వెతికే నెపంతో యువకుడి తల్లిదండ్రులు,అతని సోదరిని వెంట తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆ యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనపై మొదట పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాధితురాలి తల్లిదండ్రులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.