ప్రతి నెలా ఏకంగా రూ.15,000 పింఛన్
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. బిహార్. అక్టోబర్/నవంబర్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును కొనసాగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ల రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే.
బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్నివహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఒక్కో వర్గానికి ఒక్కో రకమైన సంక్షేమ తాయిలాలను వెల్లడిస్తూ వస్తోన్న ఆయన.. ఇప్పడు తాజాగా జర్నలిస్టుల సంక్షేమానికీ నడుం బిగించారు.

బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద- ప్రస్తుతం అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ 6,000 రూపాయల మొత్తాన్ని అందిస్తోందక్కడి ప్రభుత్వం. ఎన్నికల సమీపించిన నేపథ్యంలో ఈ మొత్తాన్ని భారీగా పెంచింది. ఇకపై ప్రతి నెలా 6,000 రూపాయలకు బదులుగా 15,000 రూపాయల నెలవారీ పెన్షన్ అందించాలని నిర్ణయించింది.
ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు నితీష్ కుమార్ వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి పెరిగిన పింఛన్ మొత్తం చెల్లించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కిందఅర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ప్రతి నెలా 15,000 రూపాయల పింఛన్ అందజేయనుంది.
ఈ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్టులు మరణించినట్లయితే- వారి జీవిత భాగస్వామికి జీవితాంతం చెల్లిస్తోన్న 3,000 రూపాయల మొత్తాన్ని కూడా భారీగా పెంచినట్లు నితీష్ కుమార్ వెల్లడించారు. 3,000 రూపాయలకు బదులుగా ప్రతి నెలా 10,000 నెలవారీ పెన్షన్ అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తారని, వారు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి వారని, సామాజిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోన్నారని నితీష్ కుమార్ ప్రశంసించారు. నిష్పాక్షికంగా వార్తలను అందించి సమాజాన్ని పురోగమింపజేస్తారని, అట్టడుగు వర్గాల వారినీ చైతన్యవంతులను చేస్తారని అన్నారు.
అలాంటి జర్నలిస్టులు పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వీలుగా వారికి అందజేసే నెలవారీ పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచినట్లు చెప్పారు. ఎన్నికల వరాల్లో భాగంగా నితీష్ కుమార్ గతంలో 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి గృహావసర విద్యుత్ వినియోగదారులు 125 యూనిట్ల వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.












Click it and Unblock the Notifications