టాప్ న్యూస్ ప్రజెంటర్ ను పెళ్లాడిన సీఎం ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్ట్ చేశారు. తన జీవితంలో ఓ నూతన ప్రయాణం ప్రారంభమైందనే క్యాప్షన్ వీటికి జత చేశారు. వివాహ కార్యక్రమం అంతా శుక్రవారం పూర్తయినట్లు వెల్లడించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తోన్నారు. ఒమర్ అబ్దుల్లాకు ఇది రెండో వివాహం. మొదటి భార్య పాయల్ అబ్దుల్లాతో విడిపోయారు. 2009 నుంచీ వేరుగా ఉంటోన్నారు. వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడానికి సుప్రీంకోర్టు ఇటీవలే ఆమోదం తెలిపింది. రాజ్యాంగపరమైన నిబంధనలను అనుసరించి ఈ విడాకుల ప్రక్రియ పూర్తయింది.

ఈ సుదీర్ఘ న్యాయ వివాదానికి తెరపడిన తర్వాతే ఒమర్ అబ్దుల్లా తన రెండో వివాహం చేసుకున్నారు. నిధి రజ్దాన్ తో కలిసి నూతన జీవిత ప్రయాణాన్ని ఆరంభించారు. ఒమర్ అబ్దుల్లా, పాయల్ నాథ్ వివాహం 1994లో జరిగింది. ఢిల్లీలోని ప్రముఖ ఒబెరాయ్ హోటల్‌లో ఇద్దరూ పనిచేస్తున్న సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. అది వివాహానికి దారితీసింది. ఈ దంపతులకు జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
వ్యక్తిగత మనస్పర్థలు, అభిప్రాయ భేదాల వల్ల 2009లో విడిపోయారు. అప్పటి నుండి వేర్వేరుగా ఉంటోన్నారు. 2011లో తాము విడిపోయిన విషయాన్ని ఒమర్ అబ్దుల్లా అధికారికంగా వెల్లడించారు కూడా. తొలుత విడాకులు మంజూరు చేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సొచ్చింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా పరస్పర అంగీకారంతో విడిపోవడానికి అంగీకరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి విడాకులకు ఆమోదం తెలపాలని ఇరువర్గాల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవడానికి కూడా సమ్మతించాయి. ఈ ఏడాది జులై 31న వారికి విడాకులను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీంతో ఒమర్ అబ్దుల్లా, పాయల్ నాథ్ వివాహ బంధానికి అధికారికంగా తెరపడినట్టయింది.
A new journey began yesterday 💍@Nidhi https://t.co/BXbdLq2d1H
— Omar Abdullah (@OmarAbdullah) October 31, 2026
ఆ తర్వాత కొద్దినెలల వ్యవధిలోనే ఒమర్ అబ్దుల్లా.. నిధి రజ్దాన్ ను పెళ్లాడారు. నిధి రజ్దాన్.. సీనియర్ జర్నలిస్ట్. మీడియాలో దశాబ్దాల అనుభవం ఉంది. ఓ టాప్ ఇంగ్లీష్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటేటర్ గా దేశవ్యాప్తంగా సుపరిచితురాలే. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా క్లిష్టమైన పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఒమర్ అబ్దుల్లా జీవితంలో ఈ నూతన ప్రయాణాన్ని ఆరంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.













Click it and Unblock the Notifications
