తప్పు తెలుసుకున్న సిద్ధరామయ్య..!!
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకొంది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి సైతం మొదలు పెట్టింది. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ హెచ్చరించింది కూడా.
గత ఏడాది జులైలో దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య తాలుకా బెళ్లారపేటెలో దారుణహత్యకు గురైన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు భార్య నూతన కుమారికి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఉద్యోగాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన కల్పించిన ఉద్యోగం.

లైబ్రరీ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు నూతన కుమారి. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులోని సెయింట్ ఫిలోమెనా కళాశాల, వివేకానంద పీయూ కాలేజీల్లో ఏడు సంవత్సరాల పాటు లైబ్రేరియన్‌గా పని చేశారు. బీజేపీ కార్యకర్త అయిన ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో బొమ్మై ప్రభుత్వం ఆమెకు మంగళూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాన్ని కల్పించింది.
ఈ ఉద్యోగాన్ని రద్దు చేసింది సిద్ధరామయ్య సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదొక్కటే కాదు- బొమ్మై ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న కొన్ని కీలకమైన కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. నూతన కుమారి ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోవడం రాజకీయ రంగు పులుముకొన్న నేపథ్యంలో- సిద్ధరామయ్య అప్రమత్తం అయ్యారు. నూతన కుమారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరిగి ఇస్తామని ప్రకటించారు.
ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. నూతన కుమారి విషయాన్ని ప్రత్యేకంగా తీసుకుంటామని, మానవతా దృక్పథంతో ఆమెకు ఉద్యోగాన్ని కల్పిస్తామని తెలిపారు. ఒక పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కాంట్రాక్ట్, రాజకీయ ప్రాతిపదిక నిర్ణయాలను మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పునఃసమీక్షించడం సర్వ సాధరణమేనని సిద్ధరామయ్య వివరించారు.
ఇతరత్రా కారణాల వల్ల 150 మందికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన బొమ్మై ప్రభుత్వం ఉద్యోగాలను ఇచ్చిందని, వాటిని తాము రద్దు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నూతన కుమారి ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆమెకు విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని ఇస్తామని హమీ ఇచ్చారు సిద్ధరామయ్య.












Click it and Unblock the Notifications