డ్యామేజీ కంట్రోల్: సిఎన్ఆర్‌తో ఏకీభవించిన జైపాల్
బెంగళూరు/న్యూఢిల్లీ: భారతరత్న అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు ఆదివారం రాజకీయ నాయకులపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. సైన్స్ కోసం తక్కువ నిధులు కేటాయిస్తున్న రాజకీయ నాయకులు ఇడియట్స్ అని ఆదివారం ఆయన మండిపడ్డ విషయం తెలిసిందె. శాస్త్ర పరిశోధనలకు నిధుల కేటాయింపులో రాజకీయ నేతలంతా విఫలమవుతున్నారని మరో వ్యాఖ్య చేశారు. అయితే తన మాటలు వివాదాస్పదం కావడంతో కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తోపాటు సిఎన్ఆర్ రావుకు ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందె. అయితే భారతరత్న ప్రకటించిన కొంత సమయానికి సిఎన్ఆర్ రావు రాజకీయ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. శాస్త్ర పరిశోధనల కోసం వారు నిధులు కేటాయించడం లేదని, ఇడియట్స్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఆయన సోమవారం మాట్లాడుతూ.. తాను రాజకీయ నాయకులను ఇడియట్స్ అనలేదని, సరైన నిధులు కేటాయించడం లేదని మాత్రమే అన్నానని ఆయన వివరణ ఇచ్చారు.

తను పరిశోధనల కోసం నిధులు కేటాయించలేదని మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశానని, రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. తన ఆగ్రహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు. తాను ఎవర్ని ఇడియట్స్ అనలేదని తెలిపారు. ఆవేశంలో కొన్ని పదాలు వచ్చాయని, సాధారణంగా తను అలా మాట్లాడనని తెలిపారు. పరిశోధనల కోసం ఇంకా ఎక్కువ మొత్తం నిధులు కేటాయిస్తే పరిశోధనలు ఎక్కువగా జరిగి ఎక్కువ అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు.
పరిశోధనల కోసం 20 నుంచి 30శాతం వరకే నిధులను సైన్స్ సెక్టార్ కేంద్రాన్ని కోరుతోందని ఆయన తెలిపారు. తన వ్యాఖ్యలపై ఇంత వివాదం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని రావు అన్నారు. కాగా సిఎన్ఆర్ రావు వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. శాస్త్ర పరిశోధనలకు కావాల్సిన మొత్తాన్ని కేటాయించట్లేదనేది వాస్తవమేనని ఆయన అన్నారు. శాస్త్ర పరిశోధనల కోసం ఇంకా ఎక్కువ మొత్తాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications