ఏడ్చేసిన కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ డిప్కే- నివురు గప్పిన నిప్పు: జంతర్ మంతర్ వద్ద ర్యాపిడ్ యాక్షన్
దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వేదికగా కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలు భారీ ఆందోళనకు దిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ నడుం బిగించాయి. సోనమ్ వాంగ్ చుక్ దీక్ష ఆమరణ నిరాహార దీక్షను తాము కొనసాగిస్తోన్నట్లు ప్రకటించాయి.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు ఈ ఉదయం భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఆయనను బలవంతంగా సఫ్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని కూడా ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నెల 20వ తేదీన వాంగ్‌చుక్ మద్దతుదారులు పార్లమెంట్‌కు శాంతియుత మార్చ్ చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ గందరగోళం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా అభిజిత్ డిప్కే కన్నీరు పెట్టుకున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ను తలచుకుని ఏడ్చేశారు. వేదికపై ఆయన ఖాళీ చేసిన స్థానాన్ని డిప్కే భర్తీ చేశారు. పోలీసుల భగ్నం చేయడం వల్ల అర్ధాంతరంగా ముగిసిన వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షను తాను కొనసాగిస్తోన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అభిజీత్ దిప్కే పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా సమరశీల పోరాటం చేస్తున్న తమపై పోలీసులు అరాచకంగా ప్రవర్తించి అణచివేసే ప్రయత్నం చేశారని, కనీస మానవత్వం లేకుండా రోడ్లపై ఈడ్చుకెళ్లారని విలపించారు.
తమకు సంఘీభావం తెలియజేయడానికి జంతర్ మంతర్ కు వస్తోన్న లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను సైతం పోలీసులు చెక్ పాయింట్ల వద్దే అడ్డుకున్నారని అభిజిత్ డిప్కే విమర్శించారు. వాంగ్‌చుక్‌ను తరలించినంత మాత్రాన ఈ ఉద్యమం ముగిసిపోదని, పార్లమెంట్ ముట్టడి దిశగా భారీ మార్చ్ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ హఠాత్పరిణామంతో దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
VIDEO | Delhi: Cockroach Janta Party (CJP) founder Abhijeet Dipke in tears after Sonam Wangchuk's removal from Jantar Mantar. #SonamWangchuck pic.twitter.com/AW1bQgZfXX
— Press Trust of India (@PTI_News) July 18, 2026
అభిజిత్ డిప్కేకు మద్దతుగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, ఇతర వామపక్షాల విద్యార్థి సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. డిప్కేకు మద్దతుగా తాము కూడా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తోన్నట్లు వెల్లడించాయి. వారికి మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు జంతర్ మంతర్ కు తరలివస్తోన్నారు. పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తోన్నారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భద్రతను మరింత పెంచారు.












Click it and Unblock the Notifications