దైవ భూమిలోకి తొలిసారి నీలి కళ్ల తెల్ల పులి ఎంట్రీ! 556 కిలోమీటర్లు ప్రయాణం
వన్యప్రాణి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునేందుకు జూలోకి ఓ అరుదైన అతిథి వచ్చేశాడు. మిరుమిట్లు గొలిపే తెల్లటి చర్మం, దానిపై నల్లటి చారలు, అత్యంత ఆకర్షణీయమైన నీలి రంగు కళ్లతో ఉన్న అరుదైన తెల్ల పులి 'తేజస్' ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్వాలియర్ జూ నుంచి సుమారు 556 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి మరీ ఈ పులి డెహ్రాడూన్‌కు చేరుకుంది. విశేషం ఏంటంటే, ఉత్తరాఖండ్ చరిత్రలోనే ఒక తెల్ల పులి ఇక్కడ అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
డెహ్రాడూన్ జూ- గ్వాలియర్ జ్యువాలాజికల్ పార్క్ మధ్య కుదిరిన టైగర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ఒప్పందంలో భాగంగా తేజస్‌ను ఇక్కడికి తీసుకువచ్చారు. దీనికి బదులుగా డెహ్రాడూన్ జూలో ఉన్న ఐదేళ్ల 'భోలా' అనే రాయ్ బెంగాల్ టైగర్‌ను గ్వాలియర్‌కు తరలించారు. రెండు జూలలో వన్యప్రాణుల వైవిధ్యాన్ని పెంచడంతో పాటు సంరక్షణ చర్యలను మరింత బలపడతానికే ఈ మార్పిడి చేపట్టామని అధికారులు తెలిపారు.

556 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు రోడ్డు మార్గాన తేజస్‌ను ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ ప్రయాణానికి దాదాపు 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిపుణులైన వెటర్నరీ డాక్టర్లు, అటవీ శాఖ అధికారులతో కూడిన 13 మంది సభ్యుల ప్రత్యేక బృందం ఈ ప్రయాణమంతా పులి వెంట ఉండి పర్యవేక్షించింది.
తేజస్ విశేషాలు
- వయసు: తేజస్ వయసు ప్రస్తుతం రెండున్నర సంవత్సరాలు.
- పుట్టి పెరిగింది: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న గాంధీ జూలాజికల్ పార్క్ (గ్వాలియర్ జూ)లో జన్మించింది. అక్కడే ఈ రెండున్నర సంవత్సరాలు పెరిగింది.
- ప్రత్యేకత: ఇది పూర్తిగా సహజమైన జన్యుపరమైన మార్పుల కారణంగా తెల్లటి రంగు చర్మం, నల్లటి చారలు, అరుదైన నీలి రంగు కళ్లతో రూపుదిద్దుకుంది. ఇది వేరే ప్రత్యేక జాతి కాదు, రాయ్ బెంగాల్ టైగర్ జాతికి చెందినదే అయినప్పటికీ దీని కళ్ల రంగు చాలా విభిన్నంగా ఉంటాయి.
క్వారంటైన్‌లో ప్రత్యేక పర్యవేక్షణ
కొత్త ప్రాంతానికి రాగానే తేజస్‌ను నేరుగా సందర్శకుల ముందుకు వదల్లేదు. నిబంధనల ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఏ జంతువునైనా కొంతకాలం క్వారంటైన్‌లో ఉంచాల్సి ఉంటుంది. అందులో భాగంగా తేజస్‌ను దాదాపు 20 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచనున్నారు. ఈ సమయంలో కేవలం జూ కీపర్, డాక్టర్లకు మాత్రమే దాని వద్దకు వెళ్లే అనుమతి ఉంటుంది. కొత్త వాతావరణానికి ఆ పులి ఎలా అలవాటుపడుతోంది, దాని ఆరోగ్యం, తిండి అలవాట్లు ఎలా ఉంటున్నాయనే అంశాలను అధికారులు నిరంతరం గమనిస్తున్నారు.
త్వరలోనే పర్యాటకుల ముందుకు..
తేజస్‌ను చూసేందుకు పర్యాటకులు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత సుమారు నెల రోజుల్లోగా దీనిని ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం ఉందని జూ యజమాన్యం తెలిపింది. తెల్ల పులి అనేది వేరే ప్రత్యేక జాతి కాదని, కేవలం జన్యుపరమైన అరుదైన మార్పుల వల్ల బెంగాల్ టైగర్ ఇలా తెల్లటి రంగులో మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన తెల్ల పులి రాకతో డెహ్రాడూన్ జూ క్రేజ్ మరింత పెరగడంతో పాటు పర్యాటక రంగం మరింత ఊపందుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
