ఈసీ ఉక్కిరి బిక్కిరి..! SIR పూర్తయిన రాష్ట్రాల్లో మరో స్పెషల్ డ్రైవ్..!
దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR) నిర్వహణ విషయంలో తీవ్రంగా విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఓవైపు కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల మాట వినకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు, మరోవైపు రాష్ట్రాల్లో దాదాపు 13 కోట్ల ఓటర్లను తొలగించారన్న ఆరోపణలతో ఈసీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో, పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లతో పాటు యువకులు, మొదటిసారి ఓటు వేయనున్న వారిని జాబితాలో చేర్చడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. నిరంతర అప్‌డేషన్ ప్రక్రియలో భాగంగా, జాబితాలో చేరని, యువ, మొదటిసారి ఓటు వేసే అర్హులైన ఓటర్ల నమోదు కోసం జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టబోతున్నారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మూడో విడత ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికేలా పలు రాష్ట్రాల్లో ముగిసింది. ఈ ప్రక్రియలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ముసాయిదా ఓటర్ల జాబితాల నుండి సుమారు 13 కోట్ల పేర్లను తొలగించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ తాజా డ్రైవ్ ఉద్దేశం ఓటర్ల జాబితాలో నుంచి తొలగించిన వారందరూ పొరపాటున జాబితా నుండి తీసేసిన అర్హులైన ఓటర్లే అని కాదని ఈసీ వర్గాలు చెప్తున్నాయి. ఎస్ఐఆర్ సమయంలో లేదా ఆ తర్వాత ఎవరి పేరైనా జాబితాలో చేరకపోతే, యువకులు లేదా మొదటిసారి ఓటు వేయనున్న వారితో సహా ఎవరైనా సరే, నిరంతర అప్‌డేషన్ ప్రక్రియలో భాగంగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడానికి సంబంధిత ఈఆర్వోకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఈవోలకు ఆదేశాలు వెళ్లాయి. వీటి ఆధారంగా డీఈఓలు, ఈఆర్వోలు ఈ ఓటర్ల నమోదు కోసం తక్షణం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభిస్తారు.














Click it and Unblock the Notifications
