ఒక్క కరోనా వ్యాక్సిన్ డోసూ వృథా కావొద్దు, కరోనా బాధిత పిల్లల డేటా సేకరించండి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బారినపడిన చిన్నారుల డేటాను సేకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా కలెక్టర్లను కోరారు. అంతేగాక, కరోనా వ్యాక్సిన్లు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్క డోసు కూడా వృథా కాకుండా చూసుకోవాలని, ఎందుకంటే, అది ఒకరికి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. గురువారం ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దూర్తులకు బహు రూపాలుంటాయని కరోనావైరస్ గురించి ప్రధాని వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్‌లో కరోనా బారినపడుతున్న యువత, చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉందని, కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనావైరస్ రూపాంతరాలు చెందుతున్నందున దాని ప్రభావం యువత, పిల్లలపై ఎక్కువగా ఉంటోందన్నారు. అందుకే మనమంతా మరింత సన్నద్ధతతో ఉండాలన్నారు. యువత, పిల్లల్లో కరోనా ప్రభావం, ఎంతమంది ఈ మహమ్మారి బారినపడుతున్నారనే డేటాను సిద్ధం చేయాలని సూచించారు.

ఒక వ్యాక్సిన్ డోసును వృథా చేయడమేంటే.. అది కరోనా నుంచి ఒకరి రక్షణ తీసివేసినట్లేనని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందుకే వ్యాక్సిన్ వృథాను అరికట్టాలన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వృథా అనేది సమస్యగా మారిందని, దాన్ని సమర్థవంతంగా అధిగమించాలన్నారు. వ్యాక్సిన్లు మీ వద్దకు వచ్చిన తర్వాత వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఒక్క డోసు కూడా వృథా కాకుండా చూడాలన్నారు.
కరోనావైరస్ అనేది కంటికి కనిపించని రోగమని, అంతేగాక, అది రూపాంతరాలు చెందుతోందని ప్రధాని తెలిపారు. అందుకే మనం అందుకు అనుగుణంగా సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. కరోనా రకాలు ఇప్పుడు సవాలుగా మారుతున్నాయన్నారు. ఈ దేశమంతా ఒక్కటే అనే భావనతో పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు. బుధవారం కూడా ప్రధాని మోడీ దేశంలోని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ మనమంతా అప్రత్తంగానే, జాగ్రత్తగానే ఉండాలన్నారు.
Recommended Video
కాగా, గత 24 గంటల్లో దేశంలో 20,55,010 నమూనాలను పరీక్షించగా.. 2,76,110 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. తాజాగా నమోదైన 2,76,110 కరోనా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,57,72,440కి చేరింది. ఇక గత 24 గంటల్లో 3874 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,87,122కు చేరింది. కాగా, అంతకుముందు రోజు అత్యధికంగా 4529 మరణాలు నమోదు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications