"గౌతమ్ దాస్ మోడీ" కామెంట్స్ రచ్చ-కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు అవమానం-విమానం దించేసి మరీ...
ప్రధాని మోడీపై అనుచిత విమర్శలు చేసిన వివాదంలో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ప్రయాణిస్తున్న విమానం నుంచి ఆయన్ను దించేశారు.
ప్రధాని మోడీపై చేసిన విమర్శల వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాపై అసోంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాయ్ పూర్ లో ఏఐసీసీ ప్లీనరీకి బయలుదేరిన ఖేరాను ఇండిగో విమానం నుంచి అత్యవసరంగా దించేశారు. అంతే కాదు ఆయన్ను వెంటనే అసోం పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.
అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెబర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన పవన్ ఖేరా తాజాగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అదానీని వెనకేసుకొస్తున్న ప్రధానిని "నరేంద్ర గౌతమ్‌దాస్ మోదీ" అని సంబోధించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వీటిపై అసోంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఈ కేసులో పవన్ ఖేరాను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న క్రమంలో పోలీసుల తీరు వివాదాస్పదమైంది.

నిన్న అసోంలోని డిమా హసావోలోని హఫ్లాంగ్ పోలీస్ స్టేషన్‌లో ఖేరాపై కేసు నమోదైందని రాష్ట్ర ఐజీ ప్రశాంత కుమార్ భుయాన్ వెల్లడించారు. ఈ కేసులో విచారణ కోసం పవన్ ఖేరాను తీసుకురావడానికి ఢిల్లీకి ఒక బృందాన్ని పంపినట్లు ఆయన తెలిపారు. ఈ టీమ్ ఢిల్లీ విమానాశ్రయంలో రాయ్ పూర్ వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కిన పవన్ ఖేరాను అత్యవసరంగా కిందకు దించేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications