ఖర్గే ఇంట్లో- వాడివేడిగా: డీకేశి వర్గ ఎమ్మెల్యేలతో రాహుల్ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగట్లేదు. శనివారమే ఫలితాలు వెలువడినప్పటికీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై పీటముడి పడింది. ఆదివారం రాత్రి సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోయింది. సీఎల్పీ నేతను ఎంపిక చేసే సర్వాధికారాలను పార్టీ అధిష్ఠానానికి వదిలివేసింది. దీనితో కర్ణాటక రాజకీయాలు హస్తినకు షిఫ్ట్ అయ్యాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్‌ను సాధించింది. తమ నేతను ఎన్నుకోవడానికి ఆదివారం సాయంత్రం సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయం కూడా వెలువడలేదు.

పార్టీకి ఘన విజయాన్ని అందించడానికి కృషి చేసిన సిద్ధరామయ్య- డీకే శివకుమార్‌లల్లో ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలనే విషయంపై విషయంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. 50-50 ప్రాతిపదికన ఇద్దరి పేర్లను కూడా ప్రకటిస్తే ఎలా ఉంటుదనే విషయం కూడా చర్చకు వచ్చింది గానీ దీనికి డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అంగీకరించలేదు. వారు నిర్ద్వందంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలతో కూడిన సమగ్ర నివేదికను- ఏఐసీసీ పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్.. పార్టీ అధిష్ఠానానికి అందజేశారు. సీఎల్పీ సమావేశంలో చేసిన తీర్మానాన్నీ ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి పంపించారు.
ఈ నివేదికపై రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతో సమావేశం అయ్యారు. కర్ణాటక నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ వర్గానికి చెందిన వారే. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి డీకేశి వర్గ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికే ఈ భేటీ ఏర్పాటైనట్లు చెబుతున్నారు.
#WATCH | Delhi: Karnataka Congress chief DK Shivakumar arrives at the office of his brother DK Suresh. pic.twitter.com/kBS2lilvqK
— ANI (@ANI) May 16, 2023
అదే సమయంలో ఈ ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లిన డీకే శివకుమార్.. ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. మల్లికార్జున ఖర్గే-రాహుల్ గాంధీ సమావేశానికి వెళ్లలేదు. విమానాశ్రయంలో దిగిన తరువాత అక్కడి నుంచి నేరుగా తన సోదరుడు, లోక్‌సభ సభ్యుడు డీకే సురేష్ కార్యలయానికి బయలుదేరి వెళ్లారు. ఆయనను పలకరించడానికి ప్రయత్నించిన విలేకరులతో ఏమీ మాట్లాడలేదు. ముందు భోజనం చేయాలి.. అంటూ సమాధానాన్ని దాటవేశారు.












Click it and Unblock the Notifications