Sasi Tharoor: శశిథరూర్ పై కీలక నిర్ణయం దిశగా కాంగ్రెస్ ? సీనియర్ల ఒత్తిడి..!
కేరళలోని తిరువనంతపురం నుంచి వరుసగా నాలుగో సారి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచి పదవిలో కొనసాగుతున్న సీనియర్ నేత శశి థరూర్ కు ఈ మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో, ప్రధాని మోడీతో అనుబంధం పెరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానంపై నిత్య అసంతృప్తిగా ఉంటారనే పేరున్న శశి థరూర్ తాజాగా ప్రధాని మోడీ కేరళకు వచ్చినప్పుడు స్వయంగా వెళ్లి స్వాగతం పలకడం, తాజాగా ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్రంపై పొగడ్తల జల్లు కురిపించడం, ఈ ఆపరేషన్ పై విదేశాలకు వివరించే అఖిలపక్ష బృందానికి సొంత పార్టీ వద్దన్నా నేతృత్వం వహించేందుకు సిద్ధం కావడం జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి శశిథరూర్ వైదొలగడం ఒక్కటే మిగిలి ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో లేకుండా పోవడం, బీజేపికి క్రమంగా దగ్గరవడం చూస్తుంటే ఇక ఆయన్ను బహిష్కరించడం మినహా మరో మార్గం లేదని పార్టీలో సీనియర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ పై వివరించేందుకు అమెరికాకు వెళ్లే అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ అక్కడి నుంచి రాగానే ఆయనపై వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే పార్టీ వైఖరికి భిన్నంగా అడుగులు వేస్తున్న శశి థరూర్ ను ఇప్పటికిప్పుడు బహిష్కరించాలని పార్టీలో సీనియర్లు ఒత్తిడి పెంచుతుండటం వెనుక మరో కీలక కారణం కనిపిస్తోంది. థరూర్ ను కాంగ్రెస్ లోనే కొనసాగిస్తే వచ్చే ఏడాది జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కూడా ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే థరూర్ లో ఈ మైండ్ గేమ్ ఆడుతుందని కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా థరూర్ పై వేటు వేసేలా అధిష్టానంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద వంటి నేతలు చివరి వరకూ పార్టీలోనే ఉండి ఝలక్ ఇచ్చి బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు ఆ చేదు అనుభవాలు రిపీట్ కాకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది.
మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం విదేశాలకు పంపుతున్న అఖిలపక్ష బృందాల్లో చోటు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రతిపాదించిన నలుగురు ఎంపీల్ని కాదని శశి థరూర్ కు చోటు కల్పించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు థరూర్ అమెరికాకు వెళ్లే ముందే ఆయన రాజీనామాకు డిమాండ్ చేసేందుకు సైతం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే థరూర్ అమెరికాకు భారత ప్రతినిధిగా వెళ్లేందుకు తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందంటూ అంగీకరించారు.












Click it and Unblock the Notifications