బీజేపీ సెల్ఫ్ గోల్- ప్రతిపక్షాలకు కొత్త అస్త్రం: శశి థరూర్
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, ఆ పార్టీకి చెందిన వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రెటేరియట్ వేసిన అనర్హత వేటు.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్ శ్రేణులన్నీ భగ్గుమంటోన్నాయి. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడాన్ని తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ మాత్రమే కాకుండా- ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా రోడ్డెక్కుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. రైల్ రోకోలను నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బీజేపీ సెల్ఫ్ గోల్ గా అభివర్ణించారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఇవ్వాళ ఆయన తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం వల్ల ఇలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని బహుశా బీజేపీ కూడా ఊహించి ఉండకపోవచ్చని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యాయని, ఇకపై ప్రతి రాష్ట్రంలోనూ రాహుల్ గాంధీ తరచూ వార్తల్లో నిలుస్తుంటారని, అది పార్టీని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీకి అనుకూలంగా నిలిచాయని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, ఆయనకు రెండు సంవత్సరాల శిక్ష విధించిన సూరత్ కోర్టు తీర్పుపైనా శశి థరూర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసులో పిటిషనర్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, న్యాయమూర్తిని మార్చారని ఆయన గుర్తు చేశారు. స్టే కోరిన వ్యక్తి, దాన్ని ఉపసంహరించుకున్న కొద్ది రోజుల్లోనే ఈ కేసుపై విచారణ పునఃప్రారంభమైందని, తీర్పు కూడా శరవేగంగా అందిందని అని శశి థరూర్ అన్నారు. ఇది తనకు అసాధారణంగా అనిపించిందని వ్యాఖ్యానించారు. అనర్హత నోటిఫికేషన్ ను జారీ చేసిన లోక్ సభలో విధానపరమైన అవకతవకలు జరిగాయని శశి థరూర్ పేర్కొన్నారు.
రాజ్యాంగ ప్రకారం- ఈ అంశంపై రాష్ట్రపతి తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని, అక్కడి నుంచి వెలువడే నోటిఫికేషన్ పై లోక్‌సభ సెక్రటేరియట్ సంతకం చేయడం ఆనవాయితీగా వస్తోందని, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే విషయంలో రాష్ట్రపతి భవన్ తో ఎలాంటి సంప్రదింపులు జరిపిందనడానికి ఎలాంటి సాక్ష్యాలు కనిపించట్లేదని శశిథరూర్ చెప్పారు. 30 రోజుల పాటు రాహుల్ గాంధీకి అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఆయనను అనర్హుడిగా ప్రకటించేలా లోక్‌సభ సెక్రటేరియట్ మెరుపువేగంతో నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications