కాంగ్రెస్‌లో మరో వికెట్ అవుట్: గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ తరువాత..!!
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ కేటాయించిన పదవులను వదులుకుంటోన్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. పార్టీ అధిష్ఠానం తమకు ఇచ్చిన బాధ్యతల నుంచి ఇప్పటికే సీనియర్ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వైదొలిగారు. తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇప్పుడదే లిస్ట్‌లో మరో సీనియర్ నాయకుడు చేరారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. ఈ రాజీనామా లేఖలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి నుంచి తాను వైదొలగుతున్న విషయాన్ని తెలియజేయడానికి బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశం, దేశ ప్రజల కంటే తన ఆవేదన ఎక్కువేమీ కాదని చెప్పారు.

పార్టీలో స్వార్థపరులు ఎక్కువయ్యారని, అలాంటి నాయకులే నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోన్నారని, కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారని జైవీర్ షెర్గిల్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంగీకరించలేని వారి సంఖ్య పార్టీలో క్రమంగా పెరుగుతోందని చెప్పారు. అలాంటి వారి మధ్య తాను విధులను సమర్థవంతంగా నిర్వర్తించలేనని, అందుకే అధికార ప్రతినిధి పోస్ట్‌కు రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. కొంతకాలంగా ఆయన అధికార ప్రతినిధి హోదాలో విలేకరుల సమావేశాలను నిర్వహించట్లేదు.
వచ్చే నెల సెప్టెంబర్ 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర మొదలు కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఒకరి వెంట ఒకరు రాజీనామాలు చేస్తూ వస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కన్యాకుమారిలో రాహుల్ గాంధీ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. దీన్ని విజయవంతం చేయడానికి పలు పౌర సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ధరల పెరుగుదలకు నిరసనగా మెహంగాయి పర్ హల్లాబోల్ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతోంది.












Click it and Unblock the Notifications